లారెన్స్ శివలింగ రివ్యూ…ముని, కాంచన స్టైల్‌లోనే మెప్పించిందా?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో జానర్ సినిమాల్లో పట్టుదొరుకుతుంది. ఆ తర్వాత నుంచీ వాళ్ళ శైలి మార్చుకుందామన్నా సాధ్యపడదు. కానీ వాళ్ళకు గ్రిప్ దొరికిన జానర్ సినిమాల్లో మాత్రం వాళ్ళ బెస్ట్ అవుట్ పుట్ కనిపిస్తుంది. కె. విశ్వనాథ్‌కు సంగీతం, నాట్యం, సాంప్రదాయాలు ప్రధానంగా ఉండే సినిమాలు తీయడంలో పిహెచ్‌డి చేసిన స్థాయి గ్రిప్ ఉంది. అలాగే మాస్ మసాలా సినిమాలు తీయడంలో రాఘవేంద్రరావుది అందె వేసిన చెయ్యి. ఇక ఇప్పటి తరంలో చెప్పాలంటే దెయ్యం కామెడీ సినిమాల విషయంలో లారెన్స్‌కి గ్రిప్ దొరికినట్టుగానే ఉంది. వరుసగా సక్సెస్‌లు కొడుతూనే ఉన్నాడు. 

ముని, కాంచన సినిమాలు అయితే ట్రేడ్ పండిట్స్‌ని కూడా షాక్‌కి గురిచేసే స్థాయి కలెక్షన్స్ సాధించాయి. మరి ఇప్పుడు తాజాగా వచ్చిన శివలింగతో కూడా అదే ఫీట్ రిపీట్ చేయగలిగాడా లారెన్స్? చంద్రముఖిలాంటి ఆత్మల బ్యాక్ డ్రాప్ సినిమాతో అన్ని తెలుగు-తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డైరెక్టర్ పి. వాసు మరోసారి అదే జానర్‌లో తెరకెక్కిన శివలింగకు న్యాయం చేయగలిగాడా?
ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ శివలింగేశ్వర్ (లారెన్స్) కథ. మర్డరో, ఆత్మహత్యో తెలియని ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని శివలింగేశ్వర్‌కి ఆర్డర్స్ వస్తాయి. శివలింగేశ్వర్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఉండగానే…..ఒక అమ్మాయిని చూడడం..ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత ఓ గెస్ట్ హౌస్‌లో కాపురం కూడా పెట్టేస్తాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉంటాడు. అయితే శివలింగేశ్వర్ ఎవరి కేసును అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో….ఆ వ్యక్తి తాలూకూ ఆత్మ శివలింగేశ్వర్ భార్యను ఆవహిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శివలింగేశ్వర్ షాక్ అవుతాడు. అసలు ఆ చనిపోయిన వ్యక్తికి శివలింగేశ్వర్ భార్యకు ఉన్న సంబంధం ఏంటి? శివలింగేశ్వర్‌తో ఆ వ్యక్తికి ఏం సంబంధం ఉంది? ఏమీ లేదా? ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇలా బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ సాగుతుంది కథనం. ఫైనల్‌గా శివలింగేశ్వర్ న్యాయం చేయడం అనేది కథ.

ఇలాంటి కథల విషయంలో లారెన్స్‌కి మంచి గ్రిప్ ఉంది. డైరెక్టర్ పి.వాసుతో కలిసి లారెన్స్ కూడా పూర్తిగా వర్క్ చేసినట్టుగానే కనిపిస్తోంది. పి.వాసు ఓల్డ్ స్టైల్‌తో పాటు లారెన్స్ మార్క్ కూడా కనిపించింది. సినిమా ఆసాంతం ఆసక్తికరంగా ఉండేలా చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా కథనం అల్లుకున్నారు. టెక్నికల్ సపోర్ట్ కూడా బాగుంది. ఫొటోగ్రఫి మెప్పిస్తుంది. అలాగే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక లారెన్సే కంపోజ్ చేసుకున్న డ్యాన్స్ మూమెంట్స్ బాగానే ఉన్నాయని ప్రత్యకంగా చెప్పాలా? ఈ సినిమా కోసం టెక్నికల్ సపోర్ట్ ఎంత ఇవ్వాలో అంతా చేశాడు లారెన్స్.

అయితే ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్, డబ్బింగ్ విషయంలో మాత్రం చాలా లోపాలు కనిపించాయి. డబ్బింగ్ పైన అస్సలు శ్రద్ధ చూపించలేదు. అందుకే చాలా చోట్ల డైలాగ్స్ ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అలాగే లారెన్స్ నటించిన ముని, కాంచన లాంటి సినిమాలలో కామెడీకి లోటు లేకుండా చేసిన కోవై సరళ కామెడీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. ఈ సినిమాలో లారెన్స్ తల్లిగా కనిపించిన క్యారెక్టర్ చేసిన కామెడీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. సినిమా స్టార్టింగ్‌లో భయస్తుడిగా కామెడీ పండించిన లారెన్స్….ఆ తర్వాత సీరియస్ సీన్స్‌లో కూడా మెప్పించాడు. ఈ తరహా సినిమాల్లో ఇప్పటికే చాలా సార్లు నటించిన లారెన్స్……ఆ అనుభవం మొత్తం చూపిస్తూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమిళ్ కమెడియన్ వడివేలు కామెడీ కూడా మెప్పిస్తుంది.

అయితే ఈ సినిమాలో ఉన్న ప్రధాన లోపం ఒక్కటే. సినిమా చూస్తున్నంత సేపూ మైండ్ మాత్రం అస్సలు వాడకూడదు. మామూలుగా అయితే ఇలాంటి ఆత్మ కథా చిత్రాల్లో లాజిక్కులు వెతకకూడదు కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాజిక్కులు మిస్సవ్వడమనేది మరీ టూమచ్‌గా ఉంది. సినిమాని ఆసక్తికరంగా మలచాలి అన్న ప్రయత్నంలో లాజిక్కులను మాత్రం పూర్తిగా గాలికొదిలేశారు. అయితే ఆసక్తికరంగా అనిపించే కథ, కథనాలతో పాటు లారెన్స్ యాక్టింగ్ కూడా సినిమాను చూసేలా చేస్తుంది. అలాగే మరీ లారెన్స్ చెప్పిన స్థాయిలో జ్యోతికను మరిపించేలా కాకపోయినా ….హీరోయిన్ రితికా యాక్టింగ్ కూడా సినిమా బోర్ కొట్టకుండా చేస్తుంది. ఓవరాల్‌గా మరోసారి ఆత్మకథలతో థ్రిల్‌తో పాటు కామెడీని పండించే తరహా సినిమాతో పాస్ మార్కులు కొట్టేశాడు లారెన్స్. ఇంతకుముందు వచ్చిన ముని, కాంచన స్థాయిలో మరీ బాగుంది అని చెప్పలేకపోయినా…ఈ తరహా సిినిమాలను ఇష్టపడేవాళ్ళకు మాత్రం ఒకసారి చూడొచ్చు అనేస్థాయిలో ఉంటుంది ఈ లారెన్స్ శివలింగ.

రేటింగ్ః 2.75/5

ఫైనల్ వర్డ్ః లారెన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన జానర్….ఈ సారి కూడా పైసా వసూల్ అయ్యేలానే ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top