ప్రతి రోజు వంటలలో ఉపయోగించే నువ్వులు రుచితో పాటుఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయన్న సంగతి చాలా మంది స్త్రీలకు తెలియదు. నువ్వులు తింటే వేడి చేస్తాయని,త్వరగా అరగావని ఒక అపోహ చాలా మందిలో ఉన్నది. అయితే మహిళలు ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుందనే విషయం నూటికి నూరు పాళ్ళ నిజం. స్త్రీలు తరచూ ఎదుర్కొనే హార్మోన్ల సమస్యను నివారిస్తుంది.
ఋతుక్రమ సమస్యలతో బాధపడేవారు,రుతుక్రమానికి వారం లేదా పది రోజుల ముందు నువ్వులను పొడి చేసి దానిలో బెల్లం లేదా ఇంగువ కలిపి తీసుకుంటే ఆ సమయంలో వచ్చే నడుమునొప్పి,కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
కండరాల బలహినతతో బాధపడే పెద్దవారు,ఆస్టియోఫ్లోరోసిస్ తో బాధపడేవారు,ఎదుగుదల సక్రమంగా లేని పిల్లలకు ఈ విధంగా ఇస్తే మంచి పలితం కనపడుతుంది. ముందు రోజు ఒక స్పూన్ నువ్వులను నానబెట్టి ఉదయాన్నే ఆ నువ్వులను పాలతో కలిపి తీసుకొంటే వీరి సమస్య పరిష్కారం అవుతుంది.
రక్త హీనతతో బాధపడే పిల్లలకు,పెద్దవారికి ఇదొక టానిక్ లాగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో నానబెట్టిన నువ్వులను ఉదయాన్నే పరగడుపున తినాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే రక్త హీనత నుండి బయటపడవచ్చు.
నువ్వులను నేరుగా లేదా ఆహారం ద్వారా తీసుకోవటం వలన అధిక రక్తపోటు,లివర్ సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
ముఖం మీద ముడతలు మరియు మచ్చలు ఉన్నవారు ప్రతి రోజు స్నానానికి ముందు ముఖానికి నువ్వుల నూనె పట్టించి,అరగంట తర్వాత శనగ పిండి తో రుద్దితే మీ చర్మం నిగనిగలాడుతూ ముడతలు మరియు మచ్చలు క్రమేపి తగ్గుతాయి.
నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది. పావు కప్పు పాలలో లభించే కాల్షియం కన్నా పావు కప్పు నువ్వులలో ఉండే కాల్షియం మూడు రెట్లు అధికంగా ఉంటుంది.