ఆకుకూరలు అన్ని రకాలుగా మేలు చేస్తాయని మనకు తెలిసిందే. కానీ పిల్లలు పేచి పెడుతూ ఉంటారు. వాళ్ళను మరిపించడానికి రోటి పచ్చడిలాగా చేస్తే వాళ్లు ఇష్టంగా తింటారు. గోంగూరొక్కటే కాదు ఏ ఆకుకూరైనా బావుంటుంది. తోటకూర పచ్చడి ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది.
కావలసినవి:
పచ్చిమిరపకాయలు - ఏడు, ఎండుమిరపకాయలు - ఏడు, తోటకూర కట్టలు - నాలుగు, ఉసిరికాయ అంత చింతపండు, ఒక వెల్లుల్లిపాయ,
పోపుకి - ఒక టీ స్పూన్ మినప గుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు ముక్కలు , కరివేపాకు, ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలు చేసుకోండి.
చేసే విధానం:
ముందుగా Pan లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి, పచ్చిమిరపకాయలు ఒకసారి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయాలి. రెండు కలిపి చేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఏదో ఒక రకం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి గాని తీసుకోవచ్చు. ఇప్పుడు వేగినవి పక్కకి తీసి అదే pan లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు తోటకూర కట్టలు తరిగి అందులో వేయండి.
ఆకు సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఉసిరికాయ అంత చింతపండుని కడిగి వేయండి. కొంచెం ఉప్పు వేసి చివరగా ఆఫ్ చేసేయండి .ఇది చల్లారేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక్క పల్సర్ ఇచ్చి ఈ ఆకుకూర వేసి వెల్లుల్లిపాయ ఒకటి అంటే పది రెబ్బలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి.
పచ్చడికి పోపు - మినప గుళ్ళు, ఆవాలు ,జీలకర్ర ,మెంతులు, వెల్లుల్లిపాయ కట్ చేసిన ముక్కలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి, చివరిగా ఉల్లిపాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా చేసి ఆ పోపులో ఒక్కసారి ట్రాన్స్పరెంట్ గా ఏగనిచ్చి, పచ్చడి అందులో వేసేయండి. మిక్సీ చేసిన చట్నీని అందులో వేసి కలపండి. రైస్ లో, బ్రేక్ ఫాస్ట్ లో కూడా బాగుంటుంది.