Nuvvula Pulihora: నువ్వులలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నూపప్పుతో కారం వంటలు,స్వీట్స్ చేసుకుంటాం. నూపప్పుతో పులిహోర ఎలా చేసుకుంటామో తెలుసుకుందాం.
కావలసిన వస్తువులు:
బియ్యం – 200 గ్రాములు
చింతపండు పులుసు – 1/2 కప్పు
ఎండుమిరపకాయలు – 4
ఆవాలు – 1/4 స్పూన్
జీలకర్ర – 1/4 స్పూన్
మినప్పప్పు – 1 స్పూన్
వేరుశనగగుళ్లు/పల్లీలు – 2 స్పూన్స్
ఇంగువ – చిటికెడు
పసుపు – 1/4 స్పూన్
నువ్వుపొడి – 2 స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
నూనె – 3 స్పూన్స్
తయారుచేసే విధానం
అన్నంను కొంచెం బిరుసుగా వండి ఉంచుకోవాలి. అన్నంలో ప్రతి మెతుకు విడివిడిగా ఉండాలి. అన్నంలో ఒక స్పూన్ నూనె,అర స్పూన్ పసుపు,కొంచెం కరివేపాకు,తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చల్లారబెట్టాలి. పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టి మిగిలిన నూనె పోసి వేడి చేసి ఇంగువ వేయాలి.
తర్వాత జీలకర్ర,ఆవాలు వేసి అవి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్లు ,మినప్పప్పు, పసుపు, కరివేపాకు వేసి కొంచెం రంగు మారే వరకు వేగించాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసి నిదానంగా ఉడికించాలి.
పులుసు కొంచెం చిక్కబడ్డాక నువ్వుల పొడి వేసి మరి కొంచెం సేపు ఉంచి నూనె తేలేదాకా ఉంచి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. అంతే నువ్వులపొడి పులిహోర రెడీ.