మనం ఆహారంగా క్యాప్సికంను కూడా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు
క్యాప్సికమ్ – 250 గ్రాములు
చింతపండు పులుసు – 1/2 కప్పు
జీలకర్ర – 1/2 స్పూన్
పసుపు -1/4 స్పూన్
కారం పొడి-2 స్పూన్
ఉప్పు -తగినంత
జీలకర్ర పొడి – 1 స్పూన్
మెంతిపొడి – 1/2 స్పూన్
అల్లం ,వెల్లుల్లి పేస్ట్ -1 స్పూన్
నూనె – 4 స్పూన్స్
తయారి విధానం
క్యాప్సికమ్ ను శుభ్రంగా కడిగి, తుడిచి, అంగుళం ముక్కలుగా కోసుకోవాలి. చింతపండు పులుసును చిక్కగా తీసి పక్కన పెట్టాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కాక జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలు వచ్చాక క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
ముక్కలు కొంచెం ఉడికాక అల్లం,వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం వేసి కలిపి కొంచెంసేపు వేగించాలి. ఆ తర్వాత మెంతిపొడి, జీలకర్ర పొడి,పులుసు వేసి బాగా కలిపి మూత పెట్టి నూనె తేలే వరకు నెమ్మదిగా ఉడికించాలి. క్యాప్సికమ్ ముక్కలు, మసాలా ఉడికిన తర్వాత నూనె తేలగానే దింపాలి. ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.