Chekodilu :చేకోడీలు అంటే అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. చేకోడీలు కర కర లాడుతూ గుల్లగా రావాలంటే ఇలా చెయ్యండి. చాలా బాగుంటాయి.
కావలసిన పదార్దాలు
బియ్యం పిండి - 1 కేజీ
పెసర పప్పు - 1/2 కేజీ
తినే సోడా - 1/4 స్పూన్
ఉప్పు - తగినంత
కారం - 3 స్పూన్
నూనె - 1 కేజీ
వేడి నీరు - సరిపడా
తయారుచేసే విధానం
ముందుగా పెసరపప్పును ఒక గంట నానబెట్టాలి. ఈ నానిన పప్పును శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీనిలో బియ్యం పిండి,తినే సోడా,కారం,ఉప్పు, వేడి చేసిన ఒక కప్పు నూనెను పోసి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో వేడి నీరు పోస్తూ ముద్దగా కలపాలి.
ఈ ముద్దను ఒక అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా( గోలి సైజ్ లో) చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండను అరచేతులోకి వేసుకొని వేరొక చేతి వ్రేళ్ళతో పిండిని సన్నగా పొడవుగా చేసుకొని ఆ చివర ఈ చివర కలిపి ఒక రింగ్ మాదిరిగా తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత పైన తయారుచేసి పెట్టుకున్న రింగ్ లను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిస్తే కరకర లాడే చేకోడీలు రెడీ.


