Monsoon Health Tips:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, విఫా తుఫాన్ అవశేషాల కారణంగా ఇది బలపడవచ్చని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాలతో పాటు వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం:
వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు మానవ శరీరంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి. గోరువెచ్చని నీరు లేదా ఫిల్టర్, ప్యూరిఫైయర్ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు నీళ్ల బాటిల్ తీసుకెళ్లడం మంచిది. రోడ్డు పక్కన లేదా ఎక్కడైనా సరే అపరిశుభ్రమైన నీటిని తాగవద్దు.
వర్షాకాలంలో ఆహారం ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ. అందుకే స్ట్రీట్ ఫుడ్‌ను వీలైనంతవరకు తినకుండా ఉండండి. పానీపూరీ, మసాలా పూరీ, పావ్‌బాజీ వంటి ఆహారాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఏదైనా తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది.
పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా శుభ్రంగా కడగాలి. వర్షపు నీటి కారణంగా బండ్లపై విక్రయించే వాటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంటికి తెచ్చిన వెంటనే మంచి నీటితో శుభ్రం చేయాలి.
దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడండి. నిద్రపోయేటప్పుడు పూర్తి చేతుల దుస్తులు ధరించండి. చల్లని వాతావరణంలో శరీరం వెచ్చగా ఉండేలా దుస్తులు ఎంచుకోండి.
పోషకాహారం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తినడం వల్ల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. నీరు నిలిచిన చోట దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి, నిల్వ నీటిని తొలగించండి.
వర్షాకాలంలో ఆకుకూరలు, పచ్చికాయలు తినడం మానుకోవడం మంచిది. ఇంట్లో ఉన్న మసాలా దినుసులతో కషాయం తయారు చేసి తాగితే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.