
అయితే, సుమన్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వంటి నటులు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక దశలో హీరోలుగా వెలుగొందినప్పటికీ, తర్వాత స్టార్‌డమ్ కోల్పోయి క్యారెక్టర్ నటులుగా స్థిరపడ్డారు. మరోవైపు, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు ఇప్పటికీ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. దీనికి కారణం అందరికీ తెలిసిందే.
ఒక దశలో వరుస విజయాలతో తెలుగు సినిమాలో తిరుగులేని కామెడీ హీరోగా నిలిచిన రాజేంద్ర ప్రసాద్, ‘కాష్మోరా’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించారు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులు రాజేంద్ర ప్రసాద్‌తో వరుస విజయాలు సాధించారు. అయితే, వెంకటేశ్ కెరీర్‌లో మొదటి ఇండస్ట్రీ హిట్ ‘చంటి’ సినిమా మొదట రాజేంద్ర ప్రసాద్ చేయాల్సిన చిత్రమని చాలా మందికి తెలియదు.
తమిళంలో పి. వాసు దర్శకత్వంలో ప్రభు, ఖుష్బూ జంటగా ‘చిన్న తంబీ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే, నిర్మాత కె.ఎస్. రామారావు దీని రీమేక్ రైట్స్ తీసుకుని, రాజేంద్ర ప్రసాద్‌ను హీరోగా, ఖుష్బూను హీరోయిన్‌గా అనుకుని తెలుగులో షూటింగ్ ప్రారంభించారు.
అయితే, ‘చిన్న తంబీ’ తమిళంలో ఘనవిజయం సాధించడంతో, నిర్మాత డి. రామానాయుడు, ఆయన కుమారుడు సురేష్ బాబు ఈ సినిమా వెంకటేశ్‌కు సరిపడుతుందని భావించారు. దీంతో కె.ఎస్. రామారావుని సంప్రదించి, రాజేంద్ర ప్రసాద్‌తో మొదలైన షూటింగ్‌ను ఆపేసి, వెంకటేశ్‌తో సినిమాను తీయాలని నిర్ణయించారు.
వరుస రీమేక్‌లతో విజయాలు అందుకున్న రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా, హీరోయిన్‌గా మీనాను ఎంపిక చేశారు. అప్పటికి మీనా, ఛైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా మారి, ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘ఇంద్రభవనం’ వంటి సినిమాల్లో నటించింది. వెంకటేశ్ కూడా ‘శత్రువు’, ‘కూలీ నెం.1’, ‘సూర్య ఐపీఎస్’, ‘క్షణక్షణం’ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించాడు.
1992 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘చంటి’, రూ.16 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 40 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ చిత్రం నాలుగు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమాను హిందీలో ‘అనారి’ పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘అనారి’లో కరిష్మా కపూర్ హీరోయిన్‌గా నటించింది.
అదే సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఏడాదికి 12 సినిమాలతో బిజీగా ఉన్నారు. 1992లో ‘అప్పుల అప్పారావు’, ‘పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ’, ‘బృందావనం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. ‘చంటి’ సినిమా రాజేంద్ర ప్రసాద్‌కు దక్కి ఉంటే, బహుశా ఇండస్ట్రీ హిట్ సాధించకపోయినా, నటుడిగా ఆయనకు మరింత పేరు తెచ్చి ఉండేది.
‘చంటి’ ఇండస్ట్రీ హిట్ కావడంతో వెంకటేశ్ వరుస రీమేక్‌లతో విజయాలు సాధించాడు. అదే ఏడాది విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’ను ‘చినరాయుడు’గా రీమేక్ చేశాడు, కానీ ఈ చిత్రం విఫలమైంది. ఆ తర్వాత ‘సుందరకాండ’, ‘కొండపల్లి రాజా’, ‘అబ్బాయిగారు’ వంటి రీమేక్‌లతో విజయాలు అందుకుని, ‘విక్టరీ’ స్టార్‌గా స్థిరపడ్డాడు వెంకటేశ్.