అన్నయ్య కోసం వెతుక్కుంటూ వెళ్లిన సూరికి శివ ఒక గ్యాంగ్‌స్టర్ అని తెలుస్తుంది. శివ ఎలాంటి పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్‌గా మారాడు? అతన్ని పట్టుకుని తీసుకురావాలనుకున్న సూరి ఎందుకు అన్నయ్య బాటలోనే నడిచాడు? ఇవన్నీ సినిమా చూస్తేనే తెలుస్తాయి.
విజయ్ దేవరకొండ ఉత్తమ నటన కనబరిచిన సినిమాల జాబితాలో ఇకపై ‘కింగ్‌డమ్’ తప్పకుండా ఉంటుంది. సూరి పాత్రలో అతను అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ‘రగిలే రగిలే...’ పాట సన్నివేశంలో అతని నటన అదిరిపోయింది! సినిమా మొదలు నుంచి ముగింపు వరకు తన నటనతో చిత్రాన్ని ముందుకు నడిపించాడు. విజయ్ దేవరకొండ కాకుండా కేవలం సూరిగానే కనిపించాడు.
విజయ్ తర్వాత ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర సత్యదేవ్‌ది. శివ పాత్రలో అన్నయ్యగా, హీరోగా అద్భుత నటనతో మెప్పించాడు.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసిన స్క్రిప్ట్ మాస్‌కు తగ్గట్టుగా ఉంది. అయితే, ఇది పూర్తిగా యాక్షన్ సినిమా కాదు. పరిచయ సన్నివేశం, ‘రగిలే రగిలే’ పాట, క్లైమాక్స్—ఈ మూడు చోట్ల ఎలివేషన్స్ బాగున్నాయి. మిగతా భాగం ఎమోషనల్ డ్రామాతో నడుస్తుంది. కొన్ని చోట్ల కథనం నీరసంగా అనిపించినా, డ్రామాను బాగా నిర్మించడంలో దర్శకుడు సఫలమయ్యాడు.
‘కింగ్‌డమ్’కు అనిరుధ్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. అవసరమైన సన్నివేశాల్లో మాత్రమే ఎలివేషన్ బీజీఎం ఇచ్చేలా చేశారు. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అగ్రస్థానంలో ఉన్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తక్కువ సమయం తెరపై కనిపించినా పాత్ర సమర్థవంతంగా చేసింది.
మొత్తంగా ‘కింగ్‌డమ్’ ఒక ఆకర్షణీయ డ్రామా చిత్రం. యాక్షన్ సన్నివేశాలు, రక్తపాతం ఎక్కువగా ఉంటాయని ఆశించకండి. డ్రామా భాగమే ఈ చిత్రంలో హైలైట్. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటన, అనిరుధ్ సంగీతం, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం కోసం ఈ సినిమాను ఒకసారి సంతోషంగా చూడొచ్చు.