Empty stomach:ఈ ఆహార పదార్థాలను పరగడుపున తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు.. గతంలో 50 ఏళ్లు దాటిన వారిలోనే రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపించేవి. కానీ, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా షుగర్, బీపీ సమస్యలు విస్తృతంగా వస్తున్నాయి.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి బీపీ, డయాబెటిస్ వంటి రుగ్మతలు వస్తే వాటిని పూర్తిగా నయం చేయడం కష్టం, కానీ నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యం. అందుకే వీటిని ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యలను నియంత్రించడానికి కొన్ని ఆహార పదార్థాలను పరగడుపున తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
ఉసిరి: ఉసిరికాయలు విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు లేదా పొడి చేసి నీళ్లలో కలిపి తాగవచ్చు. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, జీవక్రియలను సాఫీగా నడపడానికి సహాయపడుతుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
దాల్చినచెక్క: పరగడుపున దాల్చిన చెక్క పొడి, కొంచెం మిరియాల పొడిని నీళ్లలో కలిపి తాగితే షుగర్, రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది.
మెంతులు: మెంతుల్లోని సాల్యుబుల్ ఫైబర్ రక్తంలో చక్కెర కలిసే వేగాన్ని తగ్గిస్తుంది. రాత్రి మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం వల్ల రక్తపోటు తగ్గడంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది.
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు రక్తపోటును తగ్గిస్తాయి. రోజూ ఉదయం అవిసె గింజల పొడిని నీళ్లలో కలిపి తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
గమనిక: ఈ ఆహార పద్ధతులను అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.