High Protein Dosa :హై ప్రోటీన్ దోశ.. ఎప్పుడు తినే దోశలు కాకుండా healthy గా చేసుకోండి..రోజూ ఒకేలా ఇడ్లీలు, దోశలు తిని బోర్ కొట్టిందా? ఉదయం ఆరోగ్యకరమైన, రోజంతా ఉత్సాహాన్నిచ్చే బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే, హై ప్రొటీన్ దోశను ఒకసారి ప్రయత్నించండి.
ఈ దోశ కేవలం రుచిలోనే కాదు, పోషకాల విషయంలో కూడా అద్భుతం. పప్పుధాన్యాలు, శనగలు, క్వినోవా వంటి సూపర్ ఫుడ్స్‌తో తయారయ్యే ఈ దోశ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తుంది. సాధారణంగా మనం బియ్యం, మినపప్పుతో దోశలు తయారు చేస్తాం. కానీ ఈ దోశలో శనగలు, పెసలు, కందులు, బొబ్బర్లు, క్వినోవా వంటి పోషకమైన పదార్థాలను ఉపయోగిస్తాం. ఈ హై ప్రొటీన్ దోశను ఎలా తయారు చేయాలో చూద్దాం.
హై ప్రొటీన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
- నల్ల శనగలు - 1 కప్పు
- తెల్ల శనగలు - 1 కప్పు
- మినపప్పు - 1 కప్పు
- పెసలు - 1 కప్పు
- ఎర్ర కందిపప్పు - 1 కప్పు
- బొబ్బర్లు (అలసందలు) - 1 కప్పు
- క్వినోవా - 2 కప్పులు
- సగ్గుబియ్యం - 2 టేబుల్ స్పూన్లు
- మెంతులు - 2 టీస్పూన్లు
తయారీ విధానం
హై ప్రొటీన్ దోశ కోసం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని, అందులో నల్ల శనగలు, తెల్ల శనగలు, మినపప్పు, పెసలు, బొబ్బర్లు, క్వినోవా, ఎర్ర కందిపప్పు వేసి, నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి.
అదే సమయంలో, ఒక చిన్న గిన్నెలో సగ్గుబియ్యం, మరో గిన్నెలో మెంతులు వేసి నీళ్లు పోసి నానబెట్టండి.రాత్రంతా నానిన పదార్థాల నీటిని వంపేసి, అన్నింటినీ కలిపి మెత్తగా పిండిలా గ్రైండ్ చేయండి.
ఈ పిండిని చేత్తో బాగా కలిపి, వాతావరణాన్ని బట్టి 8-10 గంటల పాటు పులియబెట్టండి. చేత్తో కలపడం వల్ల పిండి సహజంగా పులిసి, దోశలు మెత్తగా, రుచిగా వస్తాయి.దోశలు వేసే ముందు, కావలసినంత పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపండి.
స్టవ్ మీద దోశ పెనం పెట్టి, వేడిగా ఉన్న పెనంపై నూనె రాసి, పలుచగా దోశలు వేసి, రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి. అంతే! పోషకాలతో నిండిన వేడివేడి హై ప్రొటీన్ దోశలు సిద్ధం. వీటిని పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది.