Healthy Snacks:సాయంత్రం సమయంలో జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి.. ఎంతో మేలు జరుగుతుంది.. సాయంత్రం వేళల్లో చాలా మంది జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటారు. వీధుల్లో బండ్లపై లభించే బజ్జీలు, పునుగులు, సమోసాలు, బేకరీలో దొరికే ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్‌లను ఆస్వాదిస్తుంటారు. అయితే, ఇవన్నీ మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఒక్కసారి తినడం పర్వాలేదు, కానీ తరచూ ఇలాంటి ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.
ఇవి తరచూ తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సాయంత్రం సమయంలో అనారోగ్యకరమైన స్నాక్స్‌ను మానుకోవాలి. ఆకలి వేస్తే ఏదైనా తినాలనిపిస్తుంది కదా? అవును, అలాంటప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవాలి. ఇవి రుచికి రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి తెలుసుకుందాం.
ఫూల్ మఖనా, మొలకలు
ఫూల్ మఖనా (మఖానా) గురించి అందరికీ తెలుసు. ఇవి ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఎంతో బాగుంటాయి. పెనంపై కొద్దిగా నెయ్యి వేసి ఫూల్ మఖనాలను వేయించి, కావాలంటే కొంచెం ఉప్పు, మిరియాల పొడి చల్లి తినవచ్చు. ఇవి రుచిగా ఉండటమే కాక, ఫైబర్, పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. అలాగే, మొలకలతో సలాడ్ తయారు చేసి తినవచ్చు. మొలకల్లో కీరదోస, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర కలిపి, కొంచెం నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి చల్లితే రుచికరమైన, పోషకాలతో నిండిన స్నాక్ రెడీ!
పోహా
అటుకులతో తయారు చేసే పోహా కూడా ఆరోగ్యకరమైన ఎంపిక. ఇందులో బఠానీలు, క్యారెట్, ఆలుగడ్డలు వంటి కూరగాయలు కలిపి తయారు చేస్తే రుచితో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. ఇది ఆకలిని తీర్చడమే కాక, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, సాయంత్రం సమయంలో బెల్లం, మరమరాలతో చేసిన లడ్డూలు, నువ్వుల లడ్డూలు, పల్లీ చిక్కీ, రాగి లడ్డూలు లేదా అవిసె గింజల లడ్డూలు తినవచ్చు. ఇవి ప్రోటీన్లు, పోషకాలను అందిస్తాయి.
నల్ల శనగలు, పెసలు
ఉదయం నీటిలో నానబెట్టిన నల్ల శనగలను సాయంత్రం ఉడికించి, పోపు వేసి గుడాల్లా తయారు చేసి తినవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాక, అనేక పోషకాలను అందిస్తాయి. అదేవిధంగా, పెసలు, బొబ్బర్లను కూడా ఇలాగే తయారు చేసి తినవచ్చు.
పల్లీలు, ఓట్స్
పల్లీలను నీటిలో నానబెట్టి లేదా పెనంపై వేయించి తినవచ్చు. బెల్లం ముక్కతో కలిపి తింటే రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. సాయంత్రం సమయంలో ఓట్స్‌తో తయారు చేసిన స్నాక్స్ కూడా గొప్ప ఎంపిక. ఓట్స్ ఫైబర్‌ను సమృద్ధిగా అందిస్తాయి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్ సాయంత్రం సమయంలో తింటే ఆకలి తీరడమే కాక, రుచి, పోషకాలు, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి, ఈ ఆహారాలను ఎంచుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.