Makhana Soup: బరువు తగ్గే ప్రయత్నంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన అడ్డంకి ఆహారమే. రోజూ తినే రుచిలేని సలాడ్లు, ఉడికించిన కూరగాయలు నాలుకను నిరసన చేయిస్తాయి.
ఫలితంగా డైట్ అంటేనే విసుగు పుట్టేస్తోందా? అయితే ఇకపై ఆ భయం అవసరం లేదు! మీ డైట్‌ను రుచికరంగా, పోషకాహారంతో నింపే ఒక అద్భుత రెసిపీ ఇదిగో – ప్రోటీన్ రిచ్ మఖానా సూప్.
ఫాక్స్‌టైల్ సీడ్స్ (మఖానా)లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండి, కేలరీలు చాలా తక్కువ. ఉదయం ఈ సూప్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. అనవసర స్నాకింగ్ కోరిక తగ్గుతుంది. అంతేకాకుండా, రోజంతా ఎనర్జీ, ఉత్సాహం నిండి ఉంటాయి.
కావలసిన పదార్థాలు
మఖానా – 1 కప్పు
బొంబాయి రవ్వ – ½ కప్పు
నెయ్యి – 3 టీస్పూన్లు
వేరుశనగ – ¼ కప్పు
బాదం, జీడిపప్పు – ఒక్కొక్కటి 10
బంగాళాదుంప – 1 (మీడియం)
టమాటా – 1 (మీడియం)
పచ్చిమిర్చి – 2-3
అల్లం – 1 చిన్న ముక్క
జీలకర్ర – 1 టీస్పూన్
మిరియాలు – ½ టీస్పూన్
పసుపు – ¼ టీస్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
నిమ్మరసం – 1 టీస్పూన్
కొత్తిమీర – అలంకరణకు
ఉప్పు – రుచికి తగినంత
నీరు – 3 కప్పులు
తయారీ విధానం
రవ్వ నానబెట్టడం: ఒక గిన్నెలో బొంబాయి రవ్వ తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టండి.మసాలా పొడి: పాన్‌లో మిరియాలు, ½ టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి, చల్లారాక మెత్తని పొడిగా దంచి పక్కన పెట్టండి.
నట్స్ వేయించడం: అదే పాన్‌లో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక వేరుశనగ, బాదం, జీడిపప్పులను క్రమంగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోండి.మఖానా వేయించడం: మిగిలిన నెయ్యిలో మఖానాను 2 నిమిషాలు కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టండి.
సూప్ బేస్: పెద్ద పాన్‌లో 2 టీస్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మిగిలిన ½ టీస్పూన్ జీలకర్ర, తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. సుగంధం వచ్చినప్పుడు తరిగిన బంగాళాదుంప ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి.
రవ్వ & నీరు: నానబెట్టిన రవ్వను నీటితో సహా వేసి ఉండలు కట్టకుండా కలపండి. వెంటనే 3 కప్పుల నీరు, పసుపు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు ఉడికించండి. సూప్ చిక్కగా, బంగాళాదుంపలు మెత్తగా ఉడికిపోతాయి.
ఫినిషింగ్: స్టవ్ ఆఫ్ చేసి, వేయించిన మఖానా, నట్స్ వేసి కలపండి. చివరగా మసాలా పొడి, నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లండి. వేడివేడి, ఘుమఘుమలాడే ప్రోటీన్ రిచ్ మఖానా సూప్ సిద్ధం! డైట్‌లో రుచి, ఆరోగ్యం రెండూ ఒకేసారి.

.webp)
