Tasty Sambar: ఇడ్లీ, సాంబార్లో కి ఎంత రుచికరంగా ఉండే రోడ్ సైడ్ సాంబార్ ... రుచి అమోఘం..
పొద్దున్నే వేడివేడి దోసెలు లేదా మెత్తని ఇడ్లీలు ప్లేటులో ఉంటే, పక్కన కొబ్బరి చట్నీ, కారప్పొడి ఉన్నా సరే... మన మనసు మాత్రం ఒక్కోసారి ప్రత్యేకమైన సాంబార్ కోసం ఆశపడుతుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన చిన్న బండ్ల మీద దొరికే ఆ సాంబార్ రుచి అసలు అమోఘం! దోసెను ఆ సాంబార్‌లో ముంచుకుని తింటుంటే... అదో అద్భుతమైన అనుభవం.
ఆ సాంబార్ ప్రత్యేకత ఏంటంటే – అది కేవలం కందిపప్పుతో మాత్రమే కాదు, దానిలో కలిపే పదార్థాల మిశ్రమమే ఆ అద్భుత రుచిని ఇస్తుంది. పుల్లని టమాటాలు, ఘాటైన సాంబార్ పొడి, మరో చిన్న రహస్యం... అదే శనగపిండి! ఇప్పుడు ఆ రోడ్‌సైడ్ దోసె సాంబార్‌ను ఇంట్లోనే, అంతే రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
కందిపప్పు – అర కప్పు
సాంబార్ ఉల్లిపాయలు – 10-15
పెద్ద టమాటాలు – 2 (తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు – 2
పచ్చిమిర్చి – 3 (పొడవుగా తరిగినవి)
ఇంగువ – చిటికెడు
క్యారెట్ – 1 (ముక్కలు)
పసుపు గుమ్మడికాయ ముక్కలు – అర కప్పు
సాంబార్ పొడి – 1 టీస్పూన్
పసుపు – ¼ టీస్పూన్
శనగపిండి – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 3 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)
నీరు – అవసరమైనంత
నూనె – 1 టీస్పూన్ (కుక్కర్‌లో) + 1 టేబుల్ స్పూన్ (పోపు కోసం)
ఉప్పు – రుచికి తగినంత
పోపు కోసం:
ఆవాలు – ½ టీస్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
మెంతులు – ¼ టీస్పూన్ కంటే తక్కువ
ఎండు మిర్చి – 2
కరివేపాకు – 1 రెమ్మ
తయారీ విధానం
కందిపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగి, ప్రెషర్ కుక్కర్‌లో వేసి పప్పు మునిగేంత నీరు పోసి 10 నిమిషాలు నాననివ్వండి.అదే కుక్కర్‌లో సాంబార్ ఉల్లిపాయలు, తరిగిన టమాటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, సాంబార్ పొడి, పసుపు, ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, 1 టీస్పూన్ నూనె వేసి... మరో కప్పు నీరు పోసి బాగా కలపండి.
కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు, కూరగాయలు మెత్తగా ఉడకాలి. ప్రెషర్ పూర్తిగా పోయాక మూత తీసి, గరిట లేదా మాషర్‌తో మెత్తగా మెదపండి. కూరగాయలు పూర్తి గుజ్జుగా కాకుండా కొద్దిగా ముక్కలు కనిపించేలా చూసుకోండి.
రుచికి తగినంత ఉప్పు వేసి, సాంబార్ కావాల్సిన చిక్కదనం లేదా పలుచని స్థితి వచ్చే వరకు వేడి నీరు కలుపుతూ స్టవ్ మీద మరిగించండి.
ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని, ఉండలు లేకుండా కొద్దిగా నీళ్లు పోసి గుజ్జు లాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న సాంబార్‌లో కలుపుతూ, గరిటతో నిరంతరం తిప్పుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల సాంబార్ చిక్కగా, రుచిగా మారుతుంది.
వేరే చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత మెంతులు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి... ఈ ఘుమఘుమలాడే పోపును సాంబార్‌లో కలపండి.పైన తరిగిన కొత్తిమీర చల్లి, ఒక నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి.
అంతే! నోరూరించే, కమ్మని రోడ్‌సైడ్ దోసె సాంబార్ రెడీ! వేడి దోసెతో సర్వ్ చేస్తే... బండి రుచే ఇంట్లోనే!


