Cracked Heels:ఖరీదైన క్రీమ్స్ అక్కర్లేదు.. కొవ్వొత్తితోనే పగిలిన మడమలకు చెక్..చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామందిని వేధించే ప్రధాన సమస్య 'మడమల పగుళ్లు'. పొడి గాలుల వల్ల పాదాల్లో తేమ తగ్గి, చర్మం పగిలి నొప్పి, మంట పుడుతుంటాయి.
మార్కెట్లో దొరికే ఖరీదైన ఆయింట్‌మెంట్లు వాడినా ఫలితం లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ ఇంట్లో ఉండే సాధారణ కొవ్వొత్తితో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఆ అద్భుతమైన ఇంటి చిట్కా ఇదే!
ఎందుకు పనిచేస్తుంది?
కొవ్వొత్తిలోని మైనం (Wax) చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, పగుళ్లను పూడ్చుతుంది. దీనికి కొబ్బరి నూనె, ఆవ నూనె తోడైతే చర్మం మృదువుగా మారి, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
కొవ్వొత్తి ముక్కలు (లేదా మైనం) - తగినంత
కొబ్బరి నూనె - 2 టీ స్పూన్లు
ఆవ నూనె - 2 టీ స్పూన్లు
తయారీ విధానం:
ఒక చిన్న గిన్నెలో కొవ్వొత్తి ముక్కలు వేసి సన్నని మంటపై కరిగించాలి.మైనం పూర్తిగా కరిగాక, అందులో కొబ్బరి నూనె, ఆవ నూనె వేసి బాగా కలపాలి.
స్టౌ ఆపేసి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారాక చక్కటి క్రీమ్‌లా మారుతుంది. దీన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
వాడే విధానం:
రాత్రి పడుకునే ముందు పాదాలను గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి, తడి లేకుండా తుడుచుకోవాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని పగుళ్లపై రాసి, మృదువుగా మసాజ్ చేయాలి.
అనంతరం సాక్సులు వేసుకుని పడుకుంటే, రాత్రంతా క్రీమ్ చర్మంలోకి ఇంకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే.. కొద్ది రోజుల్లోనే పగుళ్లు తగ్గి, మీ పాదాలు మృదువుగా, అందంగా మారుతాయి.


