Dhaniyala Podi;ధనియాల పొడి ఇలా చేసి చూడండి.. అన్నం, టిఫిన్స్ లోకి చాలా బావుంటుంది.. ఆంధ్ర స్టైల్‌లో చాలా పాపులర్ అయిన ఈ పొడి అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివాటికి సైడ్‌డిష్‌గా సూపర్ టేస్ట్ ఇస్తుంది. నెయ్యి లేదా నూనెతో కలిపి తింటే అదిరిపోతుంది!
కావలసిన పదార్థాలు:
ధనియాలు - 1 కప్పు
ఎండుమిర్చి - 10 నుండి 15 (మీ కారానికి తగినట్లు)
వెల్లుల్లి రెబ్బలు - 10 (పొట్టు తీయక్కర్లేదు)
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
చింతపండు - చిన్న ఉసిరికాయంత (నచ్చితేనే, లేకపోయినా పర్లేదు)
మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
స్టవ్ మీద కడాయి పెట్టి, ఒక టీస్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలిఇవి కాస్త వేగాక, ధనియాలు మరియు జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు సన్నని మంటపై వేయించాలి.
తర్వాత ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి, ఎండుమిర్చి కరకరలాడే వరకు వేయించుకుని స్టవ్ ఆపేయాలి. (చింతపండు వాడుతుంటే, వేడి బాండీలో ఆఖరున వేసి కాసేపు ఉంచితే మెత్తబడుతుంది).వేయించిన దినుసులన్నింటినీ ఒక ప్లేటులోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
మిక్సీ జార్‌లో వేయించిన దినుసులన్నీ (వెల్లుల్లి తప్ప) వేసి బరకగా లేదా మెత్తగా (మీకు నచ్చినట్లు) మిక్సీ పట్టుకోవాలి.
ఆఖరున వెల్లుల్లి రెబ్బలు వేసి, కేవలం ఒక్కసారి అలా తిప్పి ఆపేయాలి. వెల్లుల్లి మరీ మెత్తగా అవ్వకూడదు, అక్కడక్కడా తగులుతూ ఉంటే రుచి బాగుంటుంది.
అంతే! గుమగుమలాడే ధనియాల పొడి రెడీ. వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పొడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.


