Gongura Rice:"అమ్మమ్మల కాలం నాటి పక్కా పల్లెటూరి స్టైల్ 'గోంగూర రైస్' - ఆ రుచే వేరు..
కావలసిన పదార్థాలు:
ఉడికించిన అన్నం - 2 కప్పులు (పొడిపొడిగా ఉండాలి)
గోంగూర ఆకులు - 2 పెద్ద కట్టలు (శుభ్రం చేసి కడిగినవి)
పచ్చిమిర్చి - 4 లేదా 5 (మీ కారానికి తగినట్లు)
ఎండుమిర్చి - 3
వెల్లుల్లి రెబ్బలు - 6 (దంచినవి)
వేరుశెనగ గుళ్ళు (పల్లీలు) - 2 టేబుల్ స్పూన్లు
శెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, అందులో 1 స్పూన్ నూనె వేయండి.నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించి పక్కకు తీయండి.అదే పాన్ లో గోంగూర ఆకులు వేసి, అవి మెత్తగా దగ్గరకు అయ్యేంత వరకు సన్నని మంటపై మగ్గనివ్వాలి.
గోంగూర చల్లారాక, వేయించిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో లేదా రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి (మరీ మెత్తని పేస్ట్ లా చేయవద్దు).ఇప్పుడు అదే పాన్ లో మిగిలిన 2 స్పూన్ల నూనె వేయండి.
నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినపప్పు, వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా వేయించాలి.అవి వేగాక ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. చివరగా చిటికెడు పసుపు వేయండి.
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర-పచ్చిమిర్చి పేస్ట్ ను ఈ పోపులో వేసి ఒక 2 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి.రుచికి సరిపడా ఉప్పు చూసుకుని వేయండి (గోంగూరలో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేయాలి).
చివరగా ఉడికించిన అన్నం వేసి, పోపు అంతా అన్నానికి బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేయండి. అంతే! ఎంతో రుచికరమైన గోంగూర రైస్ రెడీ. దీనిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది


