ప్రతి ఇంట్లో పూజా గదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదయం లేవగానే దేవుడిని దర్శించుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతాము. కానీ, దేవుడి పటాలు సరైన దిశలో పెట్టకపోతే ఇంట్లో ప్రతికూల శక్తులు (Negative Energy) ఏర్పడే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మీ ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలంటే ఏ దేవుడి పటం ఏ దిక్కున ఉండాలో, పూజా గదిలో పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూజా మందిరానికి సరైన దిశ ఏది?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్యం (North-East), తూర్పు (East) లేదా ఉత్తర (North) దిశలలో ఉండటం చాలా శ్రేయస్కరం.
పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏ దేవుడి పటం ఏ దిక్కున ప్రతిష్టించాలి?
1. తూర్పు దిశ (East)
సూర్య భగవానుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు, మరియు కార్తికేయుడి పటాలను లేదా విగ్రహాలను తూర్పు దిశలో ఉంచాలి. ఈ పటాలు పడమర వైపు చూస్తున్నట్లుగా ప్రతిష్టించాలి. తూర్పు వైపు దేవుళ్లను పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
2. ఉత్తర దిశ (North)
ఉత్తర దిశ సంపదకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి, కుబేరుడు, మరియు విఘ్నాలు తొలగించే వినాయకుడు, సరస్వతీ దేవి పటాలను ఉత్తర దిశలో ఉంచాలి. ఈ దిశలో లక్ష్మీ కుబేరులను పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
3. దక్షిణ దిశ (South)
సాధారణంగా దక్షిణ దిశను యమస్థానంగా భావిస్తారు కాబట్టి ఈ దిశలో దేవుడి పటాలు పెట్టకూడదు. కానీ, దక్షిణ ముఖాంజనేయ స్వామి (హనుమంతుడు) లేదా భైరవ స్వామి పటాలను మాత్రమే దక్షిణ దిశలో ఉంచవచ్చు. ఇది ఇంట్లోని దృష్టి దోషాలను, భయాలను పారద్రోలుతుంది.
4. పశ్చిమ దిశ (West)
మీరు ఏవైనా గురువులను పూజిస్తుంటే.. అంటే సాయిబాబా, గౌతమ బుద్ధుడు, లేదా మహావీరుడి పటాలను పశ్చిమ దిశలో ఉంచడం వాస్తు ప్రకారం మంచిది.
పూజా గదిలో అస్సలు చేయకూడని తప్పులు ఇవే!
రౌద్ర రూపాలు వద్దు: ఇంట్లో ఉగ్ర రూపంలో ఉన్న దేవతల (ఉదాహరణకు నటరాజ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి, మహాకాళి) విగ్రహాలు లేదా పటాలు పెట్టకూడదు. ప్రశాంతంగా, చిరునవ్వుతో ఉన్న పటాలనే ఎంచుకోవాలి.
పగిలిన పటాలు/విగ్రహాలు: పూజా గదిలో పగిలిన విగ్రహాలు, రంగులు వెసిసిపోయిన లేదా పాడైన దేవుడి పటాలు అస్సలు ఉంచకూడదు. వాటిని వెంటనే నదిలో నిమజ్జనం చేయాలి లేదా చెట్టు కింద పెట్టాలి.
చనిపోయిన వారి ఫోటోలు: దేవుడి పటాలతో పాటుగా చనిపోయిన పితృదేవతల (Ancestors) ఫోటోలను ఉంచరాదు. పితృదేవతల ఫోటోలను ఎల్లప్పుడూ ఇంటి దక్షిణ గోడకు మాత్రమే తగిలించాలి.
ఎదురెదురుగా దేవుళ్లు: ఒకే దేవుడికి చెందిన రెండు పటాలు లేదా విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా చూసుకుంటున్నట్లుగా పెట్టకూడదు.
పూజా గది స్థానం: మెట్ల కింద, బాత్రూమ్ గోడకు ఆనుకుని లేదా బాత్రూమ్ కి ఎదురుగా పూజా గదిని ఎప్పుడూ ఏర్పాటు చేయకూడదు.
ఈ వాస్తు నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడమే కాకుండా, మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

