ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఇటువంటి సమయంలో శరీరాన్ని ఇన్స్టెంట్ గా కూల్ చేయాలన్నా, కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలన్నా మనకి గుర్తొచ్చే మొదటి ఎంపిక ఒక గ్లాసు చెరుకు రసం.
రోడ్డు పక్కన కేవలం 20 రూపాయలకే లభ్యమయ్యే ప్రకృతి ప్రసాదించిన అమృతం అని చెప్పవచ్చు. వేసవిలో దాహం తీర్చడమే కాకుండా శరీరానికి ఒక సంజీవినిలా పనిచేస్తుంది.
ఒక గ్లాసు చెరుకు రసం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
ఎండలో తిరిగి బాగా అలసిపోయినప్పుడు మనలో చాలామంది కూల్ డ్రింక్ కొని తాగిస్తూ ఉంటారు అలా కాకుండా ఒక గ్లాసు చెరుకు రసం తాగితే అందులో ఉండే సహజసిద్ధమైన గ్లూకోజ్, సుక్రోజ్ శరీరానికి దానికి అవసరమైన తక్షణ శక్తిని అందించి క్షణాల్లో నీరసం మాయమైపోతుంది.
చెరుకు రసంలో ఉండే పోషకాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి కిడ్నీల పనితీరు బాగుండేలా చేస్తుంది. క్రమం తప్పకుండా చెరుకు రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగే అవకాశం కూడా ఉంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది.
కామెర్లు వచ్చిన వారికి చెరుకు రసం అనేది ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
చెరుకు రసంలో ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన మొటిమలను తగ్గించడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను కూడా తగ్గించి ముఖం కాంతివంతంగా మరవటానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే యాంటీ ఏజింగ్ఏ జెంట్ గా కూడా పనిచేస్తుంది.
మలబద్ధకం సమస్యతో బాధపడే వారు ఒక గ్లాసు చెరుకు రసం తాగితే దానిలో ఉండే పొటాషియం జీర్ణవ్యవస్థ సజావుగా సాగేలా చేస్తుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి.
అయితే రోడ్డు పక్కన చెరుకు రసం తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐస్ లేకుండా కాస్త నిమ్మరసం, అల్లం ముక్క కలిపి ఫ్రెష్ గా తయారు చేసే జ్యూస్ మాత్రమే తాగాలి.
డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన ప్రకారం మాత్రమే తాగాలి ఎందుకంటే చెరుకు రసంలో సహజ సిద్ధమైన చక్కెరను ఎక్కువగా ఉంటాయి.
వందల రూపాయల ఖర్చుపెట్టి కూల్ డ్రింక్స్ తాగటం కన్నా 20 రూపాయల ఖర్చుపెట్టి చెరుకు రసం తాగటం చాలా మంచిది. వేసవి దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇప్పటికైనా కూల్ డ్రింక్ తాగటం మానేసి చెరుకు రసం వంటి వాటిని తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

