ఎప్పుడూ తినే మినప్పప్పు ఇడ్లీ కాకుండా, కాస్త కొత్తగా, మరింత ఆరోగ్యకరంగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే 'మసూర్ దాల్' (ఎర్ర కందిపప్పు) ఇడ్లీ బెస్ట్ ఆప్షన్. ఎర్ర కందిపప్పులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్. ఎంతో మృదువుగా, రుచిగా ఉండే ఈ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎర్ర కందిపప్పు (Masoor Dal): 1 కప్పు
ఇడ్లీ రవ్వ: 2 కప్పులు
మినప్పప్పు: పావు (1/4) కప్పు (ఇడ్లీలు మరింత మృదువుగా రావడం కోసం)
మెంతులు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి కొద్దిగా
ముందుగా ఒక గిన్నెలో ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కనీసం 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
పప్పు బాగా నానిన తర్వాత, మిక్సీ జార్‌లో వేసి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తని పిండిలా (రెగ్యులర్ ఇడ్లీ పిండిలా) గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు వేరొక గిన్నెలో ఇడ్లీ రవ్వను కడిగి, నీళ్లు లేకుండా గట్టిగా పిండి, ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
ఈ పిండిపై మూత పెట్టి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి (Fermentation). ఇలా చేయడం వల్ల ఇడ్లీలు ప్లఫీగా వస్తాయి.
ఉదయాన్నే పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి సున్నితంగా కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, పిండిని వేయాలి.
ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఈ ప్లేట్లను పెట్టి మీడియం మంటపై 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి.
స్టవ్ ఆఫ్ చేసి, రెండు నిమిషాల తర్వాత వేడివేడి ఇడ్లీలను ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో మృదువైన 'మసూర్ దాల్ ఇడ్లీ' రెడీ! పల్లీ చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

