నోటికి ఏదైనా ఘాటుగా, కారంగా తినాలనిపించినప్పుడు రాయలసీమ స్పెషల్ 'ఎర్ర కారం' పచ్చడి బెస్ట్ ఆప్షన్. దోశ, ఇడ్లీ, ఉప్మా లాంటి టిఫిన్స్ లోకే కాదు.. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ఎర్ర కారం కలుపుకుని తింటే ఆ రుచే వేరు.
ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఉల్లిపాయలు, ఎండుమిర్చితో నిమిషాల్లో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. పక్కా రాయలసీమ స్టైల్‌లో ఎర్ర కారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
ఎండుమిర్చి: 15-20 (మీ కారానికి తగినట్లుగా)
ఉల్లిపాయలు: 2 పెద్దవి (ముక్కలుగా కోసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 10 నుండి 15
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు (ముందుగా నానబెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3 టేబుల్ స్పూన్లు (పోపు కోసం)
పోపు కోసం:
ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు
ముందుగా ఎండుమిర్చిని ఒక గిన్నెలో వేసి గోరువెచ్చని నీళ్లలో 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి మంచి రంగు వస్తుంది మరియు మెత్తగా నలుగుతుంది.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో నానబెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఇందులో నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలో ఉండే నీరు ఈ పచ్చడికి సరిపోతుంది. మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కాస్త బరకగా రుబ్బుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. (ఇదే అసలైన రాయలసీమ ఎర్ర కారం).
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి.
పోపు వేగిన తర్వాత, ముందుగా మిక్సీ పట్టుకున్న ఎర్ర కారం పచ్చడిని ఇందులో వేసి బాగా కలపాలి.
మంటను సిమ్‌లో (Low flame) ఉంచి పచ్చడిలోని పచ్చి వాసన పోయేంత వరకు సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చడిలో నుంచి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే! ఘుమఘుమలాడే రాయలసీమ స్పెషల్ 'ఎర్ర కారం' రెడీ. దీన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.
చిట్కా : దోశ వేసుకునేటప్పుడు ఈ ఎర్ర కారాన్ని దోశ పైన రాసి, కొద్దిగా నెయ్యి వేసి కాలిస్తే 'ఎర్ర కారం దోశ' అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి!
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

