కాకరకాయ చేదు అని పక్కన పెడుతున్నారా? ఇలా 'కారం పొడి' చేస్తే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు!

Kakarakaya karam
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. కానీ దానిలో ఉండే చేదు వల్ల చాలా మంది తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారు ఒక్కసారి ఈ ఆంధ్ర స్టైల్ 'కాకరకాయ కారం పొడి' ట్రై చేసి చూడండి. 

వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ కారం పొడి కలుపుకుని తింటే.. ఆహా అనాల్సిందే! పైగా ఇది అస్సలు చేదు ఉండదు, నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ కమ్మని కారం పొడిని సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
కాకరకాయలు – 300 గ్రాములు
పచ్చిశనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
మినపప్పు – 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 8 రెబ్బలు
ఎండుమిర్చి – 10 నుంచి 15
చింతపండు – చిన్న ఉసిరికాయంత
బెల్లం – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 1/3 కప్పు
తయారీ విధానం (Step-by-Step):
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి కొబ్బరిలా సన్నగా తురుముకోవాలి. ఈ తురుములో కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఓ 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. 

ఆ తర్వాత తురుమును చేత్తో గట్టిగా పిండితే చేదు రసం అంతా బయటకు వచ్చేస్తుంది. పిండిన కాకరకాయ తురుమును పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని, కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించాలి. 

ఇవి వేగాక వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి కాస్త వేపి ప్లేట్‌లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి ఎండుమిర్చిని కూడా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి, ముందుగా పిండి పెట్టుకున్న కాకరకాయ తురుమును వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లితో పాటు రుచికి సరిపడా ఉప్పు, బెల్లం వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.

పప్పుల పొడి రెడీ అయ్యాక, అందులో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ తురుమును కూడా వేసి మిక్సీని రెండు సార్లు అలా తిప్పి ఆపేయాలి (మరీ మెత్తగా అవ్వకూడదు). అంతే.. గుమగుమలాడే కమ్మని కాకరకాయ కారం పొడి రెడీ!

ఈ కారం పొడిని గాలి చొరబడని సీసాలో (ఎయిర్ టైట్ కంటైనర్) స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చేదు లేని ఈ టేస్టీ రెసిపీని మీరూ ట్రై చేయండి!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top