బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ 'మొలకల అటుకుల ఉప్మా' ట్రై చేయండి.. బ్యాచిలర్స్‌కి బెస్ట్ ఆప్షన్!

Sprouts Poha
Sprouts Poha:ఉదయం పూట హడావిడిలో హెల్తీగా, టేస్టీగా ఏమైనా చేసుకోవాలి అనుకుంటున్నారా? ముఖ్యంగా డైట్ చేసే వారికి, వంట రాని బ్యాచిలర్స్ కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. 

మొలకలు, కూరగాయలు, అటుకులతో చేసే ఈ ఉప్మా (Sprouts Poha) రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా తక్కువ టైమ్‌లో ఈజీగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
అటుకులు: 1.5 కప్పులు
నూనె: 3 టేబుల్ స్పూన్లు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు): 3 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు: ఆవాలు (1 టీస్పూన్), జీలకర్ర (1 టీస్పూన్), ఎండుమిర్చి (2)
కరివేపాకు: 2 రెబ్బలు
ఉల్లిపాయ ముక్కలు: 1/4 కప్పు
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
కూరగాయల ముక్కలు (క్యారెట్, క్యాప్సికం, టమాటా): ఒక్కోటి 1/4 కప్పు
నానబెట్టిన పచ్చి బఠానీ: 1/4 కప్పు
మొలకలు (Sprouts): 1/2 కప్పు
పసుపు: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1/4 టీస్పూన్ (రుచి బ్యాలెన్స్ చేయడానికి)
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారీ విధానం:
ముందుగా అటుకులను జల్లించి, ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి వెంటనే వంపేయాలి (లేదా జల్లెడలో వేసి కడగాలి). ఆ తర్వాత మూత పెట్టి పక్కన ఉంచితే అటుకులు మెత్తగా నానుతాయి.

స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో పల్లీలు వేసి దోరగా వేయించాక.. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి.
ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక క్యారెట్ ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి.

ఆ తర్వాత క్యాప్సికం, బఠానీ, టమాటా ముక్కలతో పాటు మొలకలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూతపెట్టి మరో 3 నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గనివ్వాలి.

కూరగాయలు, మొలకలు ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకులను అందులో వేసి, అటుకులు విరగకుండా నెమ్మదిగా కలపాలి.

ఇప్పుడు కొద్దిగా పంచదార చల్లి, పాన్ అంచుల వెంట ఒక 4 టేబుల్ స్పూన్ల నీళ్లు చిలకరించి మూతపెట్టాలి. ఇలా ఓ 3 నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే మసాలాలన్నీ అటుకులకు పట్టి పర్ఫెక్ట్‌గా తయారవుతుంది.
చివరగా మూత తీసి, స్టవ్ ఆఫ్ చేసి, నిమ్మరసం మరియు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని కలుపుకోవాలి.

అంతే! ఎంతో హెల్తీ అండ్ టేస్టీ 'స్ప్రౌట్స్ పోహా' (Sprouts Poha) రెడీ. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ ఉప్మా తింటే కడుపు నిండిన భావన కలగడమే కాకుండా, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top