కనురెప్పల టపటపలకు ఎంత డిమాండ్!

‘‘ఒక్క ఛాన్స్. ఒకే ఒక్క ఛాన్స్. అవకాశం ఇచ్చి చూడండి... నన్ను నేను నిరూపించుకుంటా. పారితోషికం కూడా వద్దు. ఫ్రీగా చేస్తా..’’ అంటూ అవకాశాల కోసం ఆరాటపడే ఔత్సాహిక నటులు చాలామందే ఉంటారు. ఆ ఒక్క ఛాన్సూ వచ్చాక, దాంతో పాటు ఫేమ్ కూడా వచ్చాక... వాళ్లు మునుపటిలా ఉండాలంటే కుదరకపోవచ్చు. ఉండాలని అనుకున్నా అలా ఉండనివ్వని పరిస్థితులు ఎదురవచ్చు. డేట్స్ కోసం వచ్చిన నిర్మాతలకు ‘ఎంతిస్తారు? కోటికి ఒక్క రూపాయి తగ్గినా డేట్స్ ఇచ్చేది లేదు’ అని కరాకండిగా చెప్పవలసిన ఒత్తిళ్లు ఏర్పడతాయి. మరో వాదన కూడా ఉంది. అంతటి ఖ్యాతిని ఆర్జించిన తర్వాత కూడా తనకు తాను తగ్గించుకొని బతకమంటే... ఎలా బతుకుతారు చెప్పండి...? బాలీవుడ్‌లో ప్రధానంగా ఈ జాబితాలోకి వచ్చేవారిలో అందాల సుందరి ఐశ్వర్యరాయ్, యూత్ ఐకాన్ కరీనా కపూర్, సెక్సీ స్టార్ కత్రినా కైఫ్, హాట్ గాళ్ కంగనా రనౌత్‌ల పేర్లు వినిపిస్తుంటాయి.





విశ్వసుందరి టైటిల్ గెల్చుకోవడంతో పాటు నటిగా, బచ్చన్ వారి కోడలిగా ఐశ్వర్య ఓ రేంజ్‌లో ఉన్నారు. ఆ స్థాయికి చేరుకోవడానికి ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇది నిజం. డబ్బు విలువ ఆమెకు తెలుసు. ముఖ్యంగా తన గురించి తనకు తెలుసు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో, సౌకర్యాల విషయంలో నిర్మాతల దగ్గర ఆమె కాస్త నిర్మొహమాటంగానే ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు ‘యాక్షన్ రీప్లే’ అనే సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ చిత్రనిర్మాతలు ఐశ్వర్య కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ కేశాలంకార, మేకప్ నిపుణులను పిలిపించారట. ఈ విషయం తెలుసుకుని ‘‘నన్నడగకుండా ఎందుకు పిలిపించారు. నా పర్సనల్ స్టయిలిస్ట్‌తో తప్ప వేరే వాళ్లతో నేను మేకప్, హెయిర్ స్టయిల్ చేయించుకోను. అది హాలీవుడ్ అయినా నాకనవసరం’’ అని నిర్మొహమాటంగా చెప్పేశారట. ఆల్రెడీ వారికి పారితోషికం ఇచ్చేశాం మేడమ్ అని నిర్మాతలు చెప్పుకున్నా లాభం లేకపోయింది. ఐష్ మొండి వైఖరి వల్ల నిర్మాతల బడ్జెట్ తలకిందులయింది.




బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు.. బెరుకుగా, బేలగా, అమాయకమైన చూపులతో ‘అయ్యో పాపం’ అనిపించేలా ఉన్న కత్రినా కైఫ్... ఇప్పుడు మాత్రం ‘వామ్మో కత్రినా’ అనే టైపులో ప్రవర్తిస్తున్నారని తెలిసింది. ఇటీవల ఈ సుందరాంగి ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ నిమిత్తం పారిస్ వెళ్లారు. తనతో పాటు తన కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ డ్రెస్సర్‌కు కూడా భారీ ఎత్తున సౌకర్యాలు కల్పించాలని కత్రినా డిమాండ్ చేశారట. అలాగే పారిస్‌లోని తన ఫేవరెట్ హోటల్‌లో బస కల్పించాలని... కాని పక్షంలో అప్పటికప్పుడు ముంబయి ఫ్లయిట్ ఎక్కేస్తానని బెదిరించారట. చేసేదేం లేక అడిగినవాటికి నిర్మాతలు తలూపారట.

సినిమా పరిశ్రమలో మగవారి ఆధిపత్యం మెండుగా ఉంటుంది కాబట్టి.. ఇంత కరాకండిగా వ్యవహరించకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఫీలింగ్‌తోనే కథానాయికలు కొంచెం కటువుగా ప్రవర్తిస్తారన్నది ఓ టాక్. హీరోలు చేసినట్లుగా ఏళ్ల తరబడి కెరీర్ ఉండదు కాబట్టి.. దీపం ఉండగానే ‘డిమాండ్’ చేయాలనే ఆలోచనతో ఇలా ప్రవర్తిస్తుంటారని కూడా పరిశీలకులు అంటుంటారు. హీరోయిన్స్ కోణంలోంచి ఆలోచిస్తే... వారి తీరే కరెక్ట్ అని సమర్థిస్తున్నవారు కూడా లేకపోలేదు. 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top