పూజలో మనం భగవంతుడికి విధిగాపత్రం, పుష్పం, ఫలం, తోయం, నారికేళం... వంటి వాటిని సమర్పిస్తాం కదా, వీటి వెనుక గల అంతరార్థాన్ని పరిశీలిద్దామా?!

పత్రం మన దేహానికి ప్రతీక. పుష్పం అంటే హృదయపుష్పం. మన హృదయం కూడా పువ్వులా కోమలంగా, కల్మషం లేకుండా స్వచ్ఛమైన పరిమళాన్ని వెదజల్లుతుండాలి. అలాంటి హృదయానికి ప్రతీకగానే మనం పుష్పాన్ని సమరిస్తున్నాం! ఫలం అంటే కర్మఫలం. పండులో విత్తనం ఉంటుంది. ఆ విత్తనం నాటితే చెట్టు వస్తుంది. మన కర్మ కూడా అంతే! కర్మవల్ల మనం మళ్లీమళ్లీ జన్మించాల్సి ఉంటుంది.

జన్మించడం వల్ల కర్మలు ప్రాప్తిస్తుంటాయి. ఫలాన్ని సమర్పిస్తున్నామంటే మన కర్మఫలాన్ని త్యజిస్తున్నామన్నమాట. సమభావనతో, ఆత్మసాక్షిగా ఎటువంటి రాగద్వేషాలూ లేకుండా జీవిస్తుంటే కర్మ ఏర్పడదు. తోయం అంటే నీరు. అంటే ఆనంద బాష్పాలన్నమాట. తలి ్లకనపడకపోతే బిడ్డ ఎంత ఆందోళన చెందుతాడో, భగవంతుడి కోసం మనం కూడా అంతగా తాపత్రయపడాలి. ‘నేను తినే ఆహారంలో, పీల్చే గాలిలో, ఎండలో, వానలో, చెట్టులో ఎక్కడ చూసినా నీవే ఉన్నావనుకుంటూ, నిన్ను చేరుకోవడానికే నేను జీవిస్తున్నాను’ అనే భావనలో మనం జాలువార్చే ఆనందబాష్పాలే ఈ తోయం. 



కొబ్బరికాయ బయటిభాగం మన శరీర బహిర్భాగాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయకు ఉండే మూడుకళ్లు మన మూడుకళ్లకు ప్రతీక (జ్ఞానం మూడోకంటికి ప్రతీక). దానికుండే పిలక మన జుట్టును, రాసే పసుపు చీమునీ, కుంకుమ రక్తాన్నీ సూచిస్తాయి. ఇలా నారికేళం మొత్తంగా మన అహంకారాన్ని సూచిస్తుంది. నారికేళాన్ని పగులగొడుతున్నామంటే మన అహంకారాన్ని త్యజిస్తున్నామని అర్థం. హారతిని కళ్లకు అద్దుకుంటున్నామంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని అర్థం. గుడిగంటలు ఎందుకు కొడతారంటే, శబ్దతరంగాలను అనుసరిస్తూ సూక్ష్మస్థితిని చేరుకోవాలనే. ఇక ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామంటే ఈరోజు నాకు జరిగే ప్రతి దానినీ మహాప్రసాదంగా స్వీకరిస్తాననీ చెప్పడమే. నిగూఢమైన ఈ అర్థాలను తెలుసుకుని, సమర్పణ భావంతో దేవుణ్ణి ప్రార్థిస్తే మోక్షం సిద్ధిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top