ఏ ఏ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ను ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం.....

రంగుల పండుగ సంక్రాంతి. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భోగి మంటలు, పిండివంటలు, పతంగుల పోటీలతో పలు రాష్ట్రాల్లో రకరకాలుగా జరుపుతారు సంక్రాంతి....................... ముత్యాల ముగ్గులు, గోగుపూల గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలతో సంక్రాంతి సంబరాలు మన రాష్ట్రంలో మొదలవుతాయి. లక్ష్మీ రమణ గోవిందో హరి.. అంటూ హరిదాసుల కీర్తనలు, అందమైన ముగ్గు మధ్యన ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, వాటిపైన పెట్టే గోగుపూలు, ముద్దబంతులతో సంక్రాంతి లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తారు ఆంధ్రులు. చిన్నారులపై పోసే భోగిపళ్ళు, కోడిపందాలు, డూడూ బసవన్నల విన్యాసాలతో పాటు కనుమ నాడు పొలం నుంచి ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం మన ప్రత్యేకత.


మహారాష్ట్రలో సంక్రాంతి పండుగను వేడుకగా జరుపుకుంటారు మహారాష్ట్రీయులు. పండుగ సమయానికి చెరకుపంట చేతికి రావడంతో ఆనందోత్సాహాలతో పంటను ఇంటికి చేరుస్తారు. ఈ పండుగ సందర్భంగా బెల్లంతో చేసిన స్వీట్లు పంచుకోవడం, మహిళలు కొత్త గాజులు వేసుకోవడం గాలిపటాలు ఎగురేయడం ఇక్కడ ప్రత్యేకత.

కర్నాటక సంక్రాంతి సందర్భంగా చెరకు ముక్కలను పంచుకోవడం కన్నడిగుల సంప్రదాయం. చేటలో కొబ్బరికాయను, వేయించిన వేరుశనగలు, ఎండుకొబ్బరిముక్కలు, బెల్లం, నవధాన్యాలను పెట్టి బంధుమిత్రులకు పంచడం కన్నడిగుల సంప్రదాయం. దీనిని ఎళ్ళుబెళ్ళ అని పిలుస్తారు.

గుజరాత్ నక్షత్రాలకు రంగులెలా వచ్చాయబ్బా అని ఆశ్చర్యపోయేటట్టు గాలిపటాల పోటీలు జరుగుతాయి గుజరాత్‌లో. సంక్రాంతి పండుగను ఇక్కడ రెండురోజుల పాటు జరుపుకుంటారు గుజరాతీయులు. ప్రతి సంవత్సరం జనవరి 14న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించడమే సంక్రాంతి ప్రత్యేకత.



పంజాబ్ సంక్రాంతి పండుగను పంజాబ్‌లో లోహ్రీ పేరుతో జరుపుకుంటారు. పండుగనాడు తెల్లవారుజామునే నదుల్లో పుణ్యస్నానం చేసి దీపాలు పట్టుకోవడం వీరి సంప్రదాయం. దీని వలన పుణ్యం కలుగుతుందని వీరి నమ్మకం. బంగారా నృత్య ప్రదర్శన కూడా పంజాబీల పండుగ వేడుకలో భాగమే.

తమిళనాడు సంక్రాంతిని 4రోజులు జరుపుకుంటారు తమిళులు. భోగి, తాయ్ పొంగల్, మాట్టు పొంగల్, కనుమ పొంగల్ అని 4 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు తమిళనాడు ప్రత్యేకత. ఇంకా ఉత్తరప్రదేశ్, అస్సాం, కేరళ, బీహార్, గోవా, మణిపూర్, హిమాచలప్రదేశ్ వంటి పలురాష్ట్రాల్లో కూడా సంక్రాంతిని జరుపుకుంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top