లైపోసక్షన్‌పై చాలామందికి ఎదురయ్యే సందేహాలు, వాటికి సమాధానాలు

లైపోలో ఎన్ని కిలోలు తొలగిస్తారు...? 
ఎన్ని కిలోలు తొలగిస్తారు అనే విషయం కంటే మన శరీరంలో అదనంగా కనిపించే ఎంత పరిమాణాన్ని తొలగిస్తారు అనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మనకు ఒకప్పుడు చాలా బిగుతుగా అనిపించే దుస్తులు ఇప్పుడు సౌకర్యంగా వేసుకోగలిగితే లైపో ప్రయోజనం నెరవేరినట్టే అని అనుకోవాలి.

లైపో తర్వాత వెంటనే బరువు పెరుగుతారా?

లైపో చేశాక అంతకు ముందు ఉన్న ఎడిమా ఫ్లుయిడ్ (నీరు) చేరుతుతుంది. అయితే కొవ్వు కంటే ఈ ఎడిమా ఫ్లుయిడ్ మరింత బరువుగా ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి లైపోసక్షన్ తర్వాత బరువు పెరిగినట్లుగా ఉంటుంది. అయితే ఇది తాత్కాలికమైన స్థితి. కాబట్టి బరువు పెరుగుతారనే ఆందోళన అవసరం లేదు.

లైపో తర్వాత డైటింగ్ చేయాలా...?

అవును... లైపో తర్వాత ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే లైపో వల్ల ప్రయోజనం ఉండదు. ఒకసారి సన్నబడ్డ తర్వాత ఆహారంపై ఎలాంటి నియంత్రణ లేకుండా మళ్లీ యథావిధిగా ఆహారం తీసుకుంటూ ఉంటే బరువు పెరుగుతారు.
అయితే అంతకు మునుపు ఆహారంపై ఎలాంటి నియంత్రణ లేనివారు, ఎక్సర్‌సైజ్‌పై దృష్టి లేనివారు... ఎంతో కొంత ఖర్చు చేసి సాధించుకున్న దాన్ని కాపాడుకోవడం కోసం లైపో తర్వాత ఆహార నియమాలు పాటించడం, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎక్సర్‌సైజ్ చేయడం వంటి నియమాలు పాటించడం వంటివి చేస్తారు.

అంతకుముందు చర్మంపై ఉన్న స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయా...?

లావెక్కే క్రమంలో చర్మం తన ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. (ముఖ్యంగా గర్భవతుల విషయంలో ఈ స్ట్రెచ్ మార్క్స్ కడుపుపై ఉండటం చూడవచ్చు). అయితే ఒకసారి చర్మంపై పడ్డ స్ట్రెచ్ మార్క్స్ లైపో చేయించిన తర్వాత కూడా పోవు.

ఎంతసేపట్లో ఇంటికి వెళ్లవచ్చు...?

సాధారణంగా లైపో అయిన ఆరేడు గంటల తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. అయితే చాలా కొద్ది మంది విషయంలో మాత్రం లైపో చేసిన తర్వాత ఒక రాత్రి ఆసుపత్రిలో ఉండాల్సి రావచ్చు.

వృత్తి, ఉద్యోగ బాధ్యతలకు ఎంతకాలం దూరంగా ఉండాలి?

సాధారణంగా రెండు రోజులు మొదలుకొని వారం పాటు ఉద్యోగ బాధ్యతలనుంచి దూరంగా ఉండాల్సిరావచ్చు. ఇది కొద్ది భాగంలో కొవ్వు తొలగించారా, లేక మరింత ఎక్కువ భాగం నుంచి తొలగించారా అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది.

ప్రత్యేకమైన దుస్తులు వాడాలా..?

చర్మం వదులైనట్లు ఉంటుంది కాబట్టి దాన్ని బిగుతుగా మార్చడానికి కొన్ని రోజుల పాటు ప్రత్యేకమైన లోపలి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది.

వ్యాయామం గాని, ఆటలుగాని ఎప్పటినుంచి ఆడవచ్చు?

లైపోసక్షన్ ప్రక్రియ అయిన మూడు వారాల తర్వాత నుంచి ఎప్పటిలాగే వ్యాయామం, ఆటలు కొనసాగించవచ్చు.

లైపోలో రిస్క్ ఏమిటి?

అన్ని ఆపరేషన్‌లలో ఉండే రిస్కే ఇందులోనూ ఉంటుంది. అనస్థీషియా, ఇన్ఫెక్షన్స్ రిస్క్ అన్ని సర్జరీల్లోనూ ఉంటుంది. ఇందులోనూ అలాంటి రిస్కే తప్ప అదనంగా రిస్క్ ఏమీ ఉండదు.

నొప్పి ఎంత...

ఇది రోగి భరించగలిగేదాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇటీవల నొప్పి నివారణకు మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నొప్పి తక్కువే ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top