ఫేస్‌బుక్‌లో ఫోటోలతో జాగ్రత్త!

నిన్నా మొన్నటి వరకూ సకల సౌలభ్యంగా కనిపించిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ విషయంలో ఇప్పుడు ఒక్కొక్క సమస్య తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కొత్త సమస్య కానప్పటికీ ఫేస్‌బుక్‌లో ఫోటో డిలిషన్ విషయంలో ఈ మధ్య నిర్వాహకులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ అకౌంట్ నుంచి ఫోటోలు అంత సులభంగా డిలీట్ కావడం లేదని, చాలా రోజుల కిందట తాము డిలీట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో దర్శనమిస్తూనే ఉన్నాయని యూజర్లు అంటున్నారు. తాము వాటిని ఎప్పుడో డిలీట్ చేశామని, అవి ఇప్పటికీ ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతూ షాక్‌నిస్తున్నాయంటున్నారు.

ఈ సమస్యపై ఫేస్‌బుక్ కొంత నిదానంగానే స్పందిస్తోంది. సాధారణంగానే మన ఫేస్‌బుక్ స్టేటస్‌లో పోస్టు చేసిన ఒక ఫోటో ‘వాల్’ మీద డిలీట్ చేసినప్పటికీ, ‘ఫోటోస్’లో అది అలాగే ఉండటం గమనించవచ్చు. అక్కడ మళ్లీ దాన్ని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక సారి అప్‌లోడ్ చేసిన ఫోటో రెండు సార్లు డిలీట్ చేయాల్సి ఉంటుంది! అప్పటికీ ‘లిమిటెడ్ పిరియడ్ ఆఫ్ టైమ్’లో ఆ ఫోటో మీ ప్రొఫైల్‌ను గమనించే వారికి కనిపిస్తూనే ఉంటుంది! ఆ పిరియడ్ 45 రోజుల వరకూ ఉంటుందని ఫేస్‌బుక్ సీఈఓనే ఈ మధ్య ప్రకటించడం విస్మయపరుస్తోంది. 


ఇంత కన్నా పెద్ద షాక్ ఏంటంటే మీరు పోస్టు చేసిన ఒక ఫోటో యూఆర్‌ఎల్‌ను ఎవరైనా సేవ్ చేసుకొంటే ఇక ఆ ఫోటో మీ చేయి దాటినట్లే! ఆ యూఆర్‌ఎల్ ఉపయోగించుకొని ఎప్పుడైనా ఆ పోస్టును వీక్షించవచ్చు. దీని వల్ల ఫోటోలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తెలిసో తె లీకో పోస్టు చేసి తర్వాత తప్పు అనో, ఇబ్బందిగా ఫీలయినా ప్రయోజనం ఉండదు. సేవ్ చేసుకొన్న యూఆర్‌ఎల్ ఉపయోగించుకొని మూడు సంవత్సరాల తర్వాత కూడా ఫోటోను తిరిగి పొందవచ్చు అనటం ఈ ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని న్యూస్ వెబ్‌సైట్‌ల విషయంలో ఇలా యూఆర్‌ఎల్ సేవ్ చేసుకోవడం చాలా ఉపయోగకరమైన సదుపాయంగా ఉంది. మరి వ్యక్తిగతమైన ఫేస్‌బుక్ అకౌంట్‌ల విషయంలో ఇది కచ్చితంగా ప్రమాదమే. యూఆర్‌ఎల్ ను ఎవరూ కాపీ చేసుకోకుండా నిరోధించడం జరిగే పని కాదు.

ఇక యూజర్ల ప్రై వసీని కాపాడుతూ, ఇబ్బందులను నిరోధించాల్సిన బాధ్యత చేపట్టాల్సిన ఫేస్‌బుక్ మాత్రం ఇంకా కొత్త సిస్టమ్ అభివృద్ధిపరుస్తున్నామని అంటోంది. డిలీట్ రిక్వెస్ట్ వచ్చే పోస్టులను కనీసం 45 రోజుల్లో తొలగించడానికే తాము తీవ్రంగా కష్టపడుతున్నామని నిర్వాహకులు అంటున్నారు. ఫేస్‌బుక్ ఇస్తున్న 45 రోజుల టైమ్‌లైన్ పై కూడా యూజర్లు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఫేస్‌బుక్‌లో ఫోటో హంటర్స్‌తో  ప్రమాదం ఉంటుందని, ఫోటోలను దుర్వినియోగం చేయాలనుకొన్న వారి పని సులువవుతోందని అంటున్నారు. హ్యాకింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ప్రై వసీ అనే పదానికి అర్థం లేకుండా పోతున్న సమయంలో త్వరలోనే కొత్త సిస్టమ్ అందుబాటులోకి తెస్తామని ఫేస్‌బుక్ ప్రామిస్ చేస్తున్నప్పటికీ ఫోటోలు పోస్టు చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించటం మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top