
- ఫ్రిజ్ ను వారానికి ఒకసారి డీఫ్రాస్ట్ చేయాలి, పాత్రలన్నీ బయటకు తీసి అరలను తుడవాలి. వెనిగర్, నీటిని సమపాళ్లలో కలిపి అందులో ముంచిన క్లాత్‌తో తుడిస్తే బ్యాక్టీరియా నశిస్తుంది. వెనిగర్ నాచురల్ క్లీనింగ్ ఎలిమెంట్ కాబట్టి దాని అవశేషాలు ఫ్రిజ్‌లో మిగిలినా ప్రమాదం ఉండదు.
- ఫ్రిజ్ అరలకు వాసనలు పట్టేస్తే... సోడియం బైకార్బనేట్ కలిపిన నీటితో క్లాత్ ముంచి తుడవాలి.
- ఫ్రిజ్ లోపల అరలను, ఎక్స్‌టర్నల్ పార్ట్‌లో ముందు, పక్కల తుడిచి బ్యాక్ పార్ట్‌ను వదిలేస్తుంటాం. నెలకోసారి బ్యాక్ పోర్షన్‌ను క్లీన్ చేయాలి.
- ఫ్రిజ్ కంటెయినర్ ఎక్స్‌టర్నల్ పార్ట్‌ని... డిటర్జంట్ కలిపిన నీటిలో ముంచిన క్లాత్‌తో తుడిచి వెంటనే పొడి వస్త్రంతో తుడవాలి.
- రిఫ్రిజిరేటర్ కాయిల్స్‌కు దుమ్ము పేరుకుపోతే పనితీరు తగ్గుతుంది. కాబట్టి నెలకోసారి లేదా కనీసం మూడు నెలలకోసారి వీటిని క్లీన్ చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే అయినా తప్పదు. కాయిల్స్ ఫ్రిజ్ కింద భాగంలో లేదా వెనుక ఉంటాయి. ఒక్కో రిఫ్రిజిరేటర్‌కు ఒక్కో రకమైన సెట్టింగ్ ఉంటుంది. వీటిని కనిపెట్టడం కష్టం అయితే మాన్యువల్‌ను ఫాలో అయితే సరిపోతుంది.
- ఫిజ్‌కు గోడకు మధ్య కనీసం అర అడుగు దూరం ఉండాలి. స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రసరిస్తుంటే ఎయిర్‌ఫిల్టర్స్ సరిగా పని చేస్తాయి, ఫ్రిజ్ ఎక్కువకాలం మన్నుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా... ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు పవర్ ఆన్‌లో ఉండకూదు.
- ఫ్రిజ్ ను క్లీన్ చేసేటప్పుడే వాడడానికి పనికి రాని పదార్థాలను, ఎండిన కూరగాయలను తీసేయాలి.
- ఫ్రిజ్ ను పాత్రలతో నింపకూడదు. పాత్రల మధ్య గాలి ధారాళంగా ప్రసరిస్తూ ఉంటే చల్లదనం సమంగా అంది పదార్థాలు తాజాగా ఉంటాయి.
- పదార్థాలు వేడిగా ఉండగానే ఫ్రిజ్‌లో పెడితే వాటి నుంచి వెలువడిన వేడి గాలి ఫ్రిజ్ అంతా ఆవరిస్తుంది. ఆ గాలి చల్లబడడానికి ఫ్రిజ్ కంప్రెసర్ ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. దాంతో కరెంటు ఖర్చు పెరుగుతుంది. దానితోపాటు అప్పటికే చల్లబడిన పదార్థాలు ఆ చల్లదనాన్ని కోల్పోతాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ కారణంగా తాజాదనాన్ని కోల్పోతాయి కూడ.
- ప్లాస్టిక్ కవర్లకు బదులు ఫ్రిజ్ కోసం ఉద్దేశించిన కవర్లను వాడాలి. గాలి దూరని ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచిన కూరగాయలు, పదార్థాలకు ప్లాస్టిక్‌లోని రసాయనాలు పట్టేస్తాయి.
- పదార్థాల మీద మూత లేకపోతే ఆహారం కలుషితం అవుతుంది. అలాగే కూరగాయలు, ఆకుల వంటి వాటిని కూడా యథాతథంగా ఫ్రిజ్‌లో పెడితే తేమను కోల్పోతాయి. కాబట్టి తగిన కవర్లలో లేదా బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
- ఫ్రిజ్ డోర్ ఎక్కువ సేపు తెరిచి ఉంచరాదు. కంటెయినర్ లోపల ఉన్న చల్లటి గాలి బయటకు పోయే కొద్దీ ఆ మేరకు చల్లదనం కోసం ఫ్రిజ్ ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. ఇది కరెంటు వృథాకు దారి తీయడమే కాక పదార్థాల తాజాదనాన్ని కూడా తగ్గడానికి కారణమవుతుంది.