పరీక్షలు దగ్గరపడ్డాయంటే పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకు ఆందోళన
మొదలవుతుంది. పరీక్షలకు పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అని కలత
చెందుతారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన
జాగ్రత్తలు...
- పిల్లలు చదువుతున్న స్కూలుకు వెళ్లి తమ పిల్లలు ఎలా చదువుతున్నారో క్లాసు టీచర్‌ను అడిగి తెలుసుకోండి. ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడ్డారు, కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
- పిల్లలతో స్నేహపూరితంగా మాట్లాడండి. వారి ఇబ్బందేమిటో కనుక్కోండి. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడితే వారిని మందలించకుండా వారి సమస్య ఏమిటో తెలుసుకోండి. వారిలో నైతిక స్థయిర్యాన్ని పెంచండి.
- పిల్లలు చదువుకునే సమయంలో మీకున్న సమయాన్ని వారి కోసం కూడా వెచ్చించండి. వారి పక్కనే ఉండి చదువు విషయంలో వారిలో ఏర్పడై సందేహాలను నివృత్తి చేయండి. వారికి అవసరమైన టైమ్ టేబుల్ తయారు చేయడంలో తోడ్పడండి.
- పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కాసేపు విరామం ఇచ్చి వారు ఉల్లాసంగా గడిపేలా ఆటపాటలకు అవకాశం ఇవ్వాలి. దీంతో వారిలో కొత్త శక్తి పుంజుకుంటుంది. మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.
- పిల్లల ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోండి. పరీక్షలకు ముందు రోజు పిల్లలకు మసాలా వంటకాలు, బిర్యానీలు, వేపుళ్లు వంటివి పెట్టకండి. వీటిని తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటివి చేస్తాయి. సాధ్యమైనంత వరకు పెరుగు, పాలు, తేనె, చాకొలెట్లు వంటివి ఇవ్వండి. ఠిపిల్లలకు రాత్రుళ్లు ఎక్కువ సేపు మేలుకోకుండా వారు పెందరాళే నిద్రపోయేలా చూడండి. రాత్రి కనీసం 6 గంటలు వారు నిద్రపోయేలా చూసుకోండి. ఠికొందరు పిల్లలు నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుండవచ్చు. నిద్రలేమి కారణంగా వారిలో రక్తహీనత ఏర్పడుతుంది. అందువల్ల అలాంటి పిల్లలను వారి తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అతనికి వైద్యం చేయాల్సి ఉంటుంది.
- పరీక్షలకు వెళ్లే సమయంలో పిల్లలు సంతోషంగా ఉండేలా చూసుకోండి. వారి మూడ్ చెడిపోయే విధంగా హెచ్చరికలు, మందలింపులు చేయకుండా ఉంటే మంచిది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులకూ బాధ్యత ఉంటుందని మరువకూడదు.