శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, దాన్ని తొలగించాటానికి అల్ట్రాసోనిక్ లైపోసక్షన్


స్థూలకాయంతో బాధపడేవారు అధిక బరువును తగ్గించుకోవడానికి ఎంచుకునే మార్గాలలో ముఖ్యమైనది లైపోసక్షన్. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, దాన్ని తొలగించడమే ఈ చికిత్సా విధానం. లైపోసక్షన్ కేవలం ఊబకాయానికి మాత్రమే చికిత్స కాదని, శరీరంలోని కొన్ని అవయవాలలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం వల్ల భవిష్యత్తులో స్థూలకాయం వల్ల ఏర్పడే దుష్పరిణామాలను నివారించవచ్చు.

స్థూలకాయంతో, అధిక బరువుతో బాధపడేవారు లైపోసక్షన్ అనగానే అది ఊబకాయానికి చేసే చికిత్సగా భావిస్తారు. కాని, లైపోసక్షన్ అన్నది కేవలం ఊబకాయం నుంచి విముక్తి పొందడానికి మాత్రమే ఉద్దేశించి కాదు. సాధారణ బరువు ఉండి, శరీరంలో కొన్ని ప్రదేశాల్లో కేంద్రీకృతమైన కొవ్వును అంటే పొట్ట, తొడలు, నడుము, చేతులు వంటి ప్రదేశాల నుండి కొవ్వు తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇది. అలాగే అధిక బరువు అంటే బిఎమ్ఐ 25 - 30 కంటే ఎక్కువ ఉండి సుమారు పదిహేను కిలోలు ఎక్కువ బరువు ఉన్న వాళ్లకు లైపోసక్షన్ పద్ధతిలో బరువు తగ్గించవచ్చు. ఇటువంటి వాళ్లకి బరువు తగ్గడంతో పాటు శరీరాకృతి కూడా వస్తుంది.
చికిత్సా విధానం
లైపోసక్షన్ అంటే 3-4 మిల్లిమీటర్లు రంధ్రాలు చేసి చర్మం కింద కేంద్రీకృతమైన కొవ్వును ద్రవరూపంలో తీసే పద్ధతి. ఇది పూర్తిగా కాస్మొటిక్ సర్జరీ. లైపోసక్షన్ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.

శరీరంలో కొవ్వు ద్రవరూపంలో ఉండదు. దాన్ని లైపోసక్షన్‌లో ద్రవంగా మార్చి రంధ్రం ద్వారా వెలుపలికి తీయడం జరుగుతుంది. కొవ్వు పొరల్లోకి నార్మల్ సెలైన్ (ఎన్ఎస్) ఎక్కించడంతో అది నీటిలో ముంచిన స్పాంజి మాదిరిగా తయారవుతుంది. దానివల్ల కొవ్వు పొరలు వేరవుతాయి. రక్తస్రావం జరగకుండా ఉంటుంది. ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి.


కొవ్వును చేతితో కాన్యులా సహాయంతో, అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా కరిగించి ద్రవరూపంలోకి మారుస్తారు. అల్ట్రాసోనిక్ తరంగాలు, శరీరంలో ఏ విధమైన దీర్ఘకాలిక మార్పులు, హాని చేయవని పరిశోధనల్లో వెల్లడైంది. ఇది అచ్చం ప్రెగ్నెన్సీలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్‌లాగానే ఉంటుంది. మూడోది అల్ట్రాసోనిక్ పద్ధతి ద్వారా ద్రవరూపంలోకి మారిన కొవ్వును సక్షన్ పంప్ సాయంతో బయటకు లాగుతారు.
తొలగించే కొవ్వు పరిమాణం
స్థూలకాయంతో బాధపడుతూ లైపోసక్షన్ చేయించుకోదలచిన వ్యక్తికి ఉన్న హిమోగ్లోబిన్ శాతం, వయసు, ఇతర వ్యాధులేమైనా ఉన్నాయా, ఎన్ని ప్రదేశాల్లో చేయాలి, బరువు, చర్మం కింద కేంద్రీకృతమైన కొవ్వు మందం పైన ఆధారపడి ఉంటుంది. వ్యక్తి శరీర తీరును బట్టి నాలుగు నుంచి పన్నెండు లీటర్ల వరకు కరిగించిన కొవ్వును సురక్షితంగా తీయవచ్చు.
అల్ట్రాసోనిక్ లైపోసక్షన్
సాధారణ పద్ధతిలో కంటే అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ ద్వారా రక్తస్రావం చాలావరకు తగ్గుతుంది. నొప్పులు తక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. త్వరగా విధులకు హాజరు కావొచ్చు. ఈ చికిత్స కూడా తక్కువ సమయంలో పూర్తవుతుంది. బరువు విషయంలోనే కాకుండా పురుషుల్లో ఛాతీ పెరుగుదలను అంటే గైనకోమాస్టియాతో బాధపడుతున్న వారికి కూడా ఈ పద్ధతిలో గ్రంధులు కరిగించడం వీలవుతుంది. దీనివల్ల మచ్చలు ఏర్పడవు.



జాగ్రత్తలు
లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత కంప్రెషర్ గార్మెంట్స్‌ను కనీసం రెండు వారాలు వేసుకోవాలి. ఈ దుస్తులు వేసుకోవడం వల్ల గాయం త్వరగా మానడమే కాకుండా, ఆపరేషన్ తర్వాత సాధారణంగా ఏర్పడే వాపు, చీము పట్టడం లాంటి దుష్ప్ర్రభావాలు ఉండవు. ప్రత్యేకంగా మెష్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసే ఈ కంప్రెషర్ గార్మెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు అవసరమైన ద్రవాన్ని తయారుచేసే లింఫాటిక్ వ్యవస్థను పరిరక్షించడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తాయి. తక్కువ కాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామాన్ని రెండు వారాల తరువాత మొదలుపెట్టాలి.
దుష్ప్రభావాలు ఉండవు
స్థూలకాయంతో బాధపడుతూ, వ్యాయామాలు, డైటింగ్ వంటి పద్ధతులు ఫలితాలివ్వని పరిస్థితులలో పదిహేడు నుంచి యాభై యేళ్ల వయసు వారు ఎవరైనా లైపోసక్షన్ చేయించుకోవచ్చు. దీనివల్ల ఏవిధమైన దీర్ఘకాలిక సమస్యలు అంటే నొప్పులు, బలహీనత, ప్రెగ్నెన్సీ సమస్యలు వంటివి రావు. అనుభవమున్న వైద్యులు చేస్తే ఈ పద్ధతిలో మంచి ఫలితాలను పొందొచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top