బిడ్డ కడుపున పడటానికి ముందు మూడు నెలల నుంచి బిడ్డ పుట్టి రెండేళ్లు గడిచేవరకూ... ఆ వెయ్యి రోజుల వ్యవధిలో తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధ

బిడ్డ కడుపున పడటానికి ముందు మూడు నెలలు, కడుపున పడ్డ క్షణం నుంచి ప్రసూతి వరకు తొమ్మిది నెలలు... ఆ తర్వాత కనీసం రెండేళ్లు. మొత్తం కలుపుకుంటే మూడేళ్లు! అంటే... దాదాపు వెయ్యి రోజులు. ఇవెంతో కీలకమైనవి. గర్భం దాల్చడం అన్నది ప్రతి స్త్రీ జీవితంలో ఒక మరచిపోలేని అనుభూతి. గర్భధారణ నుంచి వెయ్యి రోజుల పాటు తల్లి తన ఆరోగ్యంపై దృష్టిసారించి ఉంచడం అవసరం. బిడ్డ కడుపున పడటానికి ముందు మూడు నెలల నుంచి బిడ్డ పుట్టి రెండేళ్లు గడిచేవరకూ...
ఆ వెయ్యి రోజుల వ్యవధిలో తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధ గురించి వివరాలివి...

భార్యా, భర్త... ఇద్దరూ బిడ్డ కావాలని కోరుకున్న తర్వాత వెంటనే గర్భధారణ జరగడం ఒక అదృష్టమే. చాలామంది గర్భధారణ తర్వాత నెలతప్పడం వల్ల డాక్టర్‌ను సంప్రదిస్తారు. అయితే కాన్పు వరకూ ఆరోగ్యంపై మంచి శ్రద్ధ తీసుకుంటారు. ఆ తర్వాత కాస్త అశ్రద్ధ కనబరుస్తారు. బిడ్డ పుట్టుక కంటే ముందునుంచే అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ నుంచి మొదలుకొని బిడ్డ పుట్టాక కనీసం రెండేళ్ల వరకు ఆరోగ్యంపై ఒకేలాంటి శ్రద్ధ చూపించడం అవసరం. 


నెలతప్పగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- నెల తప్పిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి గర్భధారణ జరిగిందనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి.
- ఏడో నెల వచ్చే వరకు ప్రతి నెలా ఒకసారి, ఏడు నుంచి తొమ్మిదో నెల వచ్చే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి, తొమ్మిదో నెల నుంచి ప్రసవం వరకు వారానికి ఒకసారి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
- ప్రతిసారీ బీపీ, బరువు చెక్ చేయించుకోవాలి.
- అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్ వంటి పరీక్షలు డాక్టర్ సలహా మేరకు చేయించాలి.
- ఐరన్, క్యాల్షియం, వంటి మాత్రలు తప్పనిసరిగా వాడాలి. డాక్టర్‌ను సంప్రదించకుండా ఏ మందులూ వాడకూడదు.
- తేలిగ్గా జీర్ణమయ్యే అన్ని రకాల పౌష్టికాహారం (పాలు, పెరుగు, ఆకుకూరలు, పప్పు, మాంసాహారం, పండ్లు వంటివి) తీసుకుంటూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. రోజుకు కనీసం 10 గ్లాసుల కంటే ఎక్కువగా నీళ్లు తాగాలి.
- రాత్రివేళల్లో కనీసం ఎనిమిది నుంచి పది గంటలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. పగటి వేళ కూడా ఒత్తిడి లేకుండా గడపాలి.
- డాక్టర్ సలహా మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. కానీ బరువులు ఎత్తడం వంటి శ్రమతో కూడిన పనులు చేయకూడదు.
- మొదటి మూడు నెలలు, తొమ్మిదో నెలలో వీలైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకపోవడం  మంచిది. 

 - తొమ్మిది నెలలు పూర్తయ్యాక కడుపులో బిడ్డ ఉన్న పొజిషన్, బరువు, తల్లీ-బిడ్డా ఆరోగ్యం, తల్లి నుంచి బిడ్డ బయటకు రావడానికి ఉన్న దారిలో అనుకూలతలు వంటి అనేక అంశాలను బట్టి సాధారణ కాన్పు లేదా సీజేరియన్ కాన్పు అనేవి ఆధారపడతాయి.

గర్భధారణ జరిగాక...

గర్భధారణ జరిగిన నాటి నుంచి ప్రసవం వరకు ఉండే వ్యవధి దాదాపు తొమ్మిది నెలలు. వీటిని డాక్టర్లు మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్ అని, నాలుగో నెల నుంచి ఆరు నెలల వరకు రెండో ట్రైమిస్టర్ అని, ఏడు నుంచి తొమ్మిది నెలల వ్యవధిని మూడో ట్రైమిస్టర్ అని అంటారు.


మొదటి ట్రైమిస్టర్‌లో:

 ఫలదీకరణ చెందిన అండంలో విభజనలు జరుగుతూ, అవయవాలుగా రూపాంతరం చెందుతూ, శిశువు రూపాన్ని సంతరించుకుంటూ తల్లి గర్భంలో పెరుగుతుంటుంది. ఈ సమయంలో 80 శాతం మంది మహిళలకు నీరసం, కళ్లు తిరడం, వికారం, వాంతులు కావడం, రొమ్ములు నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు ఉంటాయి.

రెండో ట్రైమిస్టర్:

 ఐదో నెల చివరి నుంచి పొట్ట కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది. బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. బిడ్డలో అవయవాలన్నీ రూపుదిద్దుకొని బరువు పెరగడం మొదలవుతుంది.
  

మూడో ట్రైమిస్టర్:
 పొట్ట బాగా పెరిగి, కాబోయే తల్లికి ఆయాసంగా ఉండటం, బరువుగా అనిపించడం వంటి సమస్యలు ఉంటాయి. జీర్ణశక్తి కాస్తంత మందగిస్తుంది. కాళ్లవాపులు, నడుం నొప్పి వంటివి కనిపిస్తాయి. పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు. బిడ్డ బాగా కదులుతుంది. బరువు పెరుగుతుంది.


చాలా మంది స్త్రీలు కాన్పు తర్వాత పుట్టిన బిడ్డ బాగోగులు చూడటంతో తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తొమ్మిది నెలల పాటు జరిగిన ఎన్నో శారీరక మార్పులు తిరిగి యథాతథ స్థితిని చేరుకోడానికి 2-3 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. అశ్రద్ధ చేస్తే తల్లి బాగా నీరసించడం, జ్వరం, కుట్లు మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం, నడుము నొప్పి వంటి ఇంకా ఎన్నో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

కాన్పు తర్వాత జాగ్రత్తలు:
 
విశ్రాంతి:
 తల్లికి మానసిక ప్రశాంతత చాలా అవసరం. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల, కాన్పు తర్వాత కలిగే అలసట తగ్గుతుంది. పాలు బాగా పడతాయి.
సాధారణ కాన్పు తర్వాత వీలైనంత త్వరగా లేచి తిరగడాన్ని, ఆపరేషన్ అయితే డాక్టర్లు చెప్పిన సమయం తర్వాత తల్లి తనంతట తాను లేచి తిరగడాన్ని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, రక్తప్రసరణకు ఆటంకం లేకుండా ఉంటుంది.

వ్యక్తిగత పరిశుభ్రత:

 పరిశుభ్రంగా ఉండటం వల్ల కుట్లు త్వరగా మానడం, చీము పట్టకుండా ఉండటం వంటి సౌలభ్యాలు చేకూరతాయి.

ఆహారం:

 గర్భవతిగా ఉన్నప్పటికంటే కాన్పు తర్వాత ఎక్కువ బలమైన ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం, పాలు, పండ్లు వంటి ఆహారం తీసుకోవాలి. నీరు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. దీనివల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్స్, మలబద్దకం వంటివాటిని నివారించవచ్చు. కారం, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. మొదటి మూడు నెలలు ఐరన్, క్యాల్షియం మాత్రలు వాడటం వల్ల కాన్పు తర్వాత వచ్చే రక్తహీనత, నీరసం, నడుమునొప్పి చాలావరకు నివారించవచ్చు.

వ్యాయామాలు:

 సాధారణ కాన్పు అయ్యాక నెల తర్వాత వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకవేళ ఆపరేషన్ అయితే తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం, మంచిది. వ్యాయామం వల్ల పొట్ట కండరాలు, పెల్విక్ కండరాలు దృఢమవుతాయి. నడుమునొప్పి తగ్గుతుంది.
తల్లిపాలు: 

కాన్పు తర్వాత గంటలోగా బిడ్డకు తల్లి రొమ్మును శుభ్రం చేసి పట్టించాలి. బిడ్డ ఎంత త్వరగా రొమ్మును అందుకుంటే అంత త్వరగా పాలు ఉత్పత్తి అవుతాయి. ఆరు నెలలపాటు తల్లిపాలు ఇవ్వడం తల్లికీ, బిడ్డకూ మంచిది.

బిడ్డ పుట్టాక...


మొదటి రెండేళ్లూ బిడ్డ మీద తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధ మీదే బిడ్డ మానసిక, శారీరక అభివృద్ధి ఆధారపడి ఉంటాయి. రెండేళ్ల పాటు పిల్లల మెదడు, నాడీవ్యవస్థ బాగా వృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ సమయంలో వారికి వచ్చే ఆహారం, ప్రేమానురాగాలపైనే వారి వికాసం ఆధారపడి ఉంటుంది. పెద్దయ్యాక ఉండే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం, వ్యక్తిత్వ వికాసం... వీటన్నింటికీ మొదటి రెండేళ్ల పాటు ఉన్న శ్రద్ధే పునాది అవుతుంది. 


కాన్పు తర్వాత తల్లికి వెంటనే గర్భం అందకుండా ఉండటానికి రెండేళ్ల పాటు డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండటం అవసరం. బిడ్డకు కనీసం రెండేళ్లు వచ్చేంతవరకు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి, కని అలసిపోయి ఉన్న శరీరానికి తగిన విశ్రాంతి దొరుకుతుంది. ఆ టైమ్‌ను బిడ్డకు కేటాయించడం వల్ల బిడ్డ పెంపకంలో కూడా పరిపూర్ణత ఉంటుంది. వీటన్నింటిని బట్టి చూస్తే గర్భధారణ నుంచి బిడ్డ పుట్టాక... ఓ వెయ్యి రోజుల వ్యవధి ఎంత కీలకమో అర్థమవుతుంది.

- గర్భధారణకు ముందే డాక్టర్‌కు చెప్పాల్సిన విషయాలు

గర్భధారణకు ముందుగా తీసుకునే సలహాలను ‘ప్రినేటల్ కౌన్సెలింగ్’ అని చెప్పవచ్చు. ఇందులో కాబోయే తల్లి, తండ్రి ఇద్దరి ఆరోగ్య వివరాలను డాక్టర్‌కు చెబతారు. అవి...
కాబోయే తల్లి, తండ్రి వయసు, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు
వాళ్ల కుటుంబ సభ్యులకు ఉన్న దీర్ఘకాలికమైన జబ్బుల వివరాలు
కాబోయే తల్లి, తండ్రి వాడుతున్న మందులు (ఏవైనా ఉంటే)
ఈ వివరాలు చెప్పడం వల్ల పుట్టబోయే బిడ్డకు వచ్చే అవయవ లోపాలను చాలావరకు నివారించవచ్చు.

- గర్భధారణకు ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు (అంటే గుండెకు సంబంధించిన రుగ్మతలు, హైబీపీ, షుగర్, థైరాయిడ్ వంటివి) వాటివల్ల గర్భం ధరించిన తర్వాత తల్లికి, బిడ్డకు జరిగే హాని జరిగే అవకాశం ఉందని తెలుసుకుంటే... తగినన్ని ముందుజాగ్రత్తలు తీసుకుని ఆయా సమస్యలను నియంత్రణలోకి తెచ్చాక గర్భం ప్లాన్ చేసుకోవడం అన్ని విధాలా మంచిది.
స్థూలకాయం ఉన్నప్పుడు గర్భధారణ జరిగితే కొన్ని శారీరకమైన ఇబ్బందులతో పాటు బీపీ పెరగడం, షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు పెరగడం వంటివి జరగవచ్చు. కాబట్టి బరువు నియంత్రణలో తెచ్చాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది. 


బరువు మరీ తక్కువగా ఉండటం కూడా తల్లికీ, బిడ్డకూ మంచిది కాదు. కాబట్టి గర్భధారణ జరగాలని కోరుకునేవారు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని, ఆహారపు అలవాట్లను అనుసరించాలి.
గర్భధారణకు కనీసం మూడు నెలల ముందునుంచే రోజుకు ఒకటి చొప్పున ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం వల్ల పుట్టబోయే బిడ్డలో వెన్నెముక, నాడీ వ్యవస్థలో లోపాలు, అవయవలోపాలను నివారించవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top