ఉలి చెక్కిన పట్టణం...మహాబలిపురం

ప్రపంచానికి మనదేశాన్ని పరిచయం చేసిన తీరం ఇది.పల్లవుల రాజధాని నగరం విదేశీ వాణిజ్యానికి కేంద్రం.రాజుల కళాభిరుచి... శిల్పకారుల ఉలి నైపుణ్యాల ప్రతీక.శిల్పకారులను తయారు చేస్తున్నఈప్రాచీనశిల్పవేదిక.మహాబలిపురం... 

మహాబలిపురం తమిళనాడురాష్ట్రంలో చెన్నైకి 55 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది పల్లవుల రాజధాని. కళాప్రియులైన పల్లవరాజులు ఇక్కడ భారీ శిల్పాలను చెక్కించి ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోనే అద్భుతమైన శిల్పకళావేదికగా మార్చారు. మహాబలిపురం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ‘ఓపెన్ ఎయిర్ మ్యూజియం’. ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో నిర్ధారించిన మహాబలిపురంలో ఏ రాయీ ఉలి దెబ్బలను తప్పించుకోలేదు అనిపిస్తుంది. శిల్పకారుల చేతిలో ఒదిగి, ఉలి దెబ్బలకు ఓర్చి ప్రాణం పోసుకున్న సజీవ మూర్తులుగా మారిన రాళ్లు కొన్ని, ప్రాచీన సంస్కృతిసంప్రదాయ నిర్మాణాలుగా మరికొన్ని. ఈ నైపుణ్యాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే రథం అంతటినీ ఒకేరాయిలో చెక్కడమే.

మహాబలిపురం నాలుగవ శతాబ్దంలోనే దక్షిణభారతంలో ప్రధానమైన తీరప్రాంతం. అప్పటికే ఇక్కడి నుంచి విదేశీ వాణిజ్యం జరిగేది. అప్పటి నుంచి నిర్మాణాలు రూపొందింనప్పటికీ ఎక్కువ భాగం ఏడవ శతాబ్దానికి చెందిన మొదటి నరసింహవర్మన్, ఎనిమిదవ శతాబ్దానికి చెందిన రెండవ నరసింహవర్మన్ కాలానివి. మహాభారతకాలంలో అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడని విశ్వాసం.  



ఆ ప్రదేశంలో భారీ కట్టడం ఇక్కడ ఉంది. సముద్రతీరాన ఉన్న అతి పెద్ద ధ్యానమందిరం ఇదే. పెద్ద హాలు పొడవు 27 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు. దీని గోడలన్నీ శిల్పాలమయమే. పల్లవుల సృజనాత్మకతకు కళాపోషణకు నిలువెత్తు నిదర్శనం మహాబలిపురం శిల్పాలు. శిల్పశాస్త్ర విద్యార్థులు ఫీల్డు స్టడీకి ఇక్కడికే వస్తారు.

ఇక్కడ ప్రముఖ నిర్మాణాల్లో పాండవరథాలు, కృష్ణమండపం, అర్జునుడు తపస్సు చేసిన మండపం, వరాహగుహ, ధర్మరాజు గుహ, మహిషాసుర మర్దిని గుహ, సోమస్కంద శిల్పం, ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో పులిగుహ ప్రధానమైనవి. సముద్రతీరాన ఉన్న ఆలయం ప్రాచీన కళావారసత్వానికి నిదర్శనం. ద్రవిడశైలిలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు, విష్ణువు మూర్తులు ఉంటాయి. 



పల్లవులు చెక్కించిన రథాల్లో బౌద్ధ విహారాలు, చైత్యాల నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఇక్కడి మండపాలు అజంతా, ఎల్లోరా గుహాలయాలను గుర్తుకు తెస్తాయి. ద్రవిడ నిర్మాణశైలికి పల్లవుల అభిరుచి తోడై రూపొందిన అద్భుతాలు ఇవి. వందలాది శిల్పాల్లో అద్భుతమైన పనితనం కనిపిస్తుంది. ఇక్కడ ‘తిరు కడలైమల్లై’ ఆలయాన్ని పట్టణానికి రక్షణగా నిర్మించారని చెబుతారు. మహాబలిపురంలోని శిల్పసంపద సముద్రంపాలు కాకుండా కాపాడమని విష్ణువును కోరుతూ ఈ ఆలయాన్ని నిర్మించారని కథనం. మహాబలిపురం ఒక మాన్యుమెంట్ కాదు, మాన్యుమెంట్‌ల సమూహం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top