హెర్నియా ఆపరేషన్ తర్వాత వ్యాయామం చేయవచ్చా?

పొత్తికడుపు కండరాలు బలహీనంగా ఉన్నవారికి హెర్నియా సమస్య వస్తుంది. మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో ముక్కినప్పుడు, దగ్గినప్పుడు, ఏవైనా బరువులెత్తినప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. కడుపు కండరాలు బలహీనంగా ఉన్నవారు నడుము కిందికి ఉండే ప్యాంట్స్ వేసుకోవడం, నడుముకు కట్టుకోవాల్సిన బెల్ట్ బలంగా లేకపోవడం వల్ల కూడా ఇంగ్వైనల్ హెర్నియా సమస్య రావచ్చు. సర్జరీ అయిన వారు ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టవచ్చు. అయితే అంతకంటే ముందు వారు విధిగా సర్జన్‌ను సంప్రదించాలి. 

హెర్నియా ఆపరేషన్ అయిన వారు రోజూ ఉదయం సాయంత్రం 20 నిమిషాల చొప్పున రెండు సార్లు వాకింగ్ చేయవచ్చు. ఈ వాకింగ్ సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
వాకింగ్ సమయంలో నడుముకు అబ్డామినల్ బెల్ట్ లేదా హెర్నియా బెల్ట్ కట్టుకోవాలి.
వాకింగ్ సమయంలో నోరు కాస్త తెరచి ఉంచాలి. దీనివల్ల కడుపులో ఒత్తిడి (అబ్డామినల్ ప్రెషర్) పెరగకుండా ఉంటుంది.
బలంగా చేసే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయవద్దు.
కడుపుపై ఒత్తిడి పెంచే ఆసనాలు వేయవద్దు.
కడుపుపై ఒత్తిడి పెంచేలా బరువులు ఎత్తే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.
తొలుత ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కడుపు భాగంలోగాని, ఆపరేషన్ చేసిన చోట గాని ఎలాంటి వాపు లేకపోతే క్రమంగా ఇతర వ్యాయామాలు కూడా చేస్తూ, వాటి వ్యవధిని పెంచుకుంటూ పోవచ్చు.
 
Share on Google Plus