3 ఆకుకూరలు... 3 ముచ్చట్లు

ఆకుకూరల ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. అవన్నీ మనిషికి మేలుచేసేవే అనడంలో సందేహం లేదు. మూడురకాల ఆకుకూరల్లోని మూడు ముచ్చట్లివే...

పాలకూర: ఒకపూట భోజనంలో తినదగ్గ (అంటే ఒక సర్వింగ్ = 80 గ్రాముల్లో) పాలకూరలో ఒక వ్యక్తికి ఒక రోజుకు కావాల్సినంత విటమిన్-ఏ లభిస్తుంది. అంతేకాక 80 గ్రాముల పాలకూరలో ఒక రోజుకు ఒక వ్యక్తికి అవసరమైన విటమిన్-సిలో సగభాగం లభ్యమవుతుంది. దీనికి తోడుగా గుండెజబ్బులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దోహదపడే ఫోలేట్ కూడా పాలకూరలో పుష్కలంగా ఉంటుంది. ఈ ఫోలేట్ కేవలం గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పించడం మాత్రమే కాదు... పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రెటీనాను పరిరక్షించి కంటిచూపు మెరుగుపడటానికి దోహదపడతాయి. 

క్యాబేజీ: ఇందులో గ్లుటామిన్ అనే అమైనోయాసిడ్ ఉంటుంది. దీనికి వాపు, మంటల నుంచి ఉపశమనం కలిగించే గుణం (యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ) ఉంది. అందుకే జీర్ణకోశ వ్యవస్థ పొడవునా మంట-వాపులను నిరోధించడంతో పాటు పెద్దపేగుల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్)ను నివారిస్తుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.

బ్రకోలీ: ప్రధాన నగరాలతో పాటు ఇప్పుడిప్పుడే పట్టణాల్లోనూ లభ్యమవుతున్న ఈ బ్రకోలీ ఆకుకూర శరీరానికి హానిచేసే ఫ్రీ-రాడికల్స్ కారణంగా గాయపడే కణాలను (సెల్యులార్ డ్యామేజీ) సమర్థంగా అడ్డుకుంటుంది. ఇందులో సైతం మంట-వాపులను అడ్డుకునే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ స్వభావంతో పాటు, వైరల్ ఇన్ఫెక్షన్‌లను సమర్థంగా ఎదుర్కొనే (యాంటీవైరల్) గుణం ఉంది. క్యాన్సర్‌ను శక్తిమంతంగా ఎదుర్కొనే గుణం బ్రకోలీకి ప్రత్యేకం. ఇక ఇందులో సెలీనియం, డై-ఇండోలైల్ మిథేన్, గ్లూకోరెఫానిన్ అనే రసాయనాలు (ఫైటో కెమికల్స్) ఉన్నాయి. ఇవి శరీరానికి హానిచేసే ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top