ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా!

తల్లిదండ్రులు సరైన దారిలో నడవకపోతే పిల్లలు కూడా అడ్డదారిలోనే నడుస్తారని ఎత్తి చూపే సందర్భంలో చెప్పే సామెత ఇది.

సాధారణంగా పశువులు పొలం గట్టున ఉన్న పచ్చికను మేయాలి తప్ప పొలంలో ఉన్న పంటను కాదు. పశువులకు ఈ విచక్షణ ఉండదు కాబట్టి వాటిని కాపలా కాయడానికి ఒక మనిషి ఉంటాడు. గట్టు దిగి పొలంలోకి అడుగుపెడితే కాపలాదారు అదిలించి సరిదిద్దుతాడు. దాంతో ఆవుకు తాను గట్టున ఉన్న పచ్చికను మేయాలి తప్ప పొలంలో పంటను కాదు అన్న జ్ఞానం కలుగుతుంది. ఇక కాపలాదారు దగ్గర లేకపోయినా కూడా పొలంలో పంటను ముట్టుకోదు. పచ్చిక కోసం గట్ల వెంబడి వెతుకుతూ దొరికిన చోట కడుపు నింపుకుంటుంది. అలాగే దాని వెంట తిరుగుతూ ఉండే దూడకు కూడా గట్టున ఉన్న పచ్చిక మేయడం అలవాటౌతుంది. మరి ఆవు తనను ఎవరూ చూడడం లేదు కదా అని చేలో పంటను మేస్తే, దాని దూడకు అదే అలవాటు వస్తుంది కదా!

ఈ సామెత ఉద్దేశం కూడా అదే! ఆవు తప్పు చేస్తే దూడ తప్పు చేయకుండా ఉంటుందా అని అర్థం. పిల్లల తప్పులకు పెద్దవాళ్ల ప్రవర్తన కూడా కారణం అవుతుందని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
Share on Google Plus