నిద్రలేవగానే మెడనొప్పి... తగ్గేదెలా?

రోజూ పొద్దున్నే మెడనొప్పి వస్తోందంటే... మీరు పడుకునే పొజిషన్ లేదా మీ తలగడ, పరుపు అమరిక తీరు కారణం కావచ్చు. ఇక రోజూ సాయంత్రం నొప్పి వస్తోందంటే దానికి మీరు పనిచేసే చోట మీరు కూర్చునే తీరు కారణం కావచ్చు. స్పాండిలోసిస్ అంటే వయసు పెరుగుతున్నకొద్దీ వెన్నుపూసలలో వచ్చే మార్పులతో కలిగే పరిణామం. సాధారణంగా వయసు పైబడ్డ తర్వాత మన వెన్నెముకలోని పూసల మధ్య ఒరిపిడి తగ్గించడానికి ఉన్న మృదులాస్థి మెత్తగా, నొక్కుకపోయినట్లుగా మారుతుంది. దాని సైజ్‌కూడా తగ్గుతుంది. దాంతో వెన్ను నుంచి బయటకు వచ్చే నరాల మీద వెన్నుపూసల ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వెన్నుపూసల్లో నొప్పి, మెడ బిగుసుకుపోయినట్లుగా అనిపించడం, నొప్పి చేతులవైపునకు, ఛాతీపైకి, వీపువైపునకు పాకుతున్నట్లుగా రావడం జరుగుతుంది. 

కొందరిలో బాగా వయసు పైబడ్డాక వచ్చే ఈ సమస్య ఇప్పుడు మన వేగవంతమైన జీవనశైలి, మితిమీరిన డ్రైవింగ్, చాలా ఎక్కువగా కంప్యూటర్ వాడకం, స్థూలకాయం వంటి కారణాలతో చాలా త్వరగానే వచ్చేస్తోంది. అయితే మీ విషయానికి వస్తే మీది స్పాండిలోసిస్ కాకపోవచ్చు. చాలామందికి మెడనొప్పి అంటే స్పాండిలోసిస్ కావచ్చనే అభిప్రాయం ఉంటుంది. అయితే మెడనొప్పికి చాలా కారణాలుంటాయి. అవి... మెడకు అయ్యే గాకాలు, కొన్నిసార్లు ఎముకల అమరికలోనే లోపాలు ఉండటం, వృత్తిపరమైన సమస్యల కారణంగా వచ్చే నొప్పులు, కూర్చునే సమయంలో సరైన భంగిమ పాటించకపోవడం, సరైన ఫిట్‌నెస్ లేకపోవడం, తప్పుడు విధానంలో ఎక్సర్‌సైజ్ చేయడం, మెడ బెణకడం వంటివి.


మన వెన్నెముక మెలికలు తిరిగిన పాములా ఉంటుంది. ఇందులో కదిలే భాగం మన మెడ మాత్రమే. అంటే ఈ కదిలే భాగంలో ఏదైనా దుష్ర్పభావం పడినా అది మిగతా వెన్నెముకకూ పాకుతుంది. అందుకే మీకు మెడ లేదా వెన్నునొప్పి వస్తే... నొప్పి వచ్చిన భాగంలోనే గాక... మిగతా భాగాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తగినన్ని పోషకాల లేమి వల్ల కూడా ఎముకల్లో నొప్పి వస్తుంది. 

ప్రధానంగా విటమిన్-డి, విటమిన్-బి12 లోపాలతో పాటు థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నా వెన్నునొప్పి రావచ్చు. కాబట్టి మీరు డైటింగ్ మీద ఉన్నారా అన్న అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఒకసారి మీరు మీ తలగడ పొజిషన్‌ను సరిచేసుకోండి. అంటే మీ తలతో పాటు కొద్దిగా భుజాల వరకూ ఉన్న భాగం కూడా తలగడపైకి వచ్చేలా పడుకోండి. ఇక మీకు నొప్పి వస్తున్న చోట వేణ్ణీళ్ల కాపడం పెట్టండి. రోజూ నడక కొనసాగించండి. అయితే మిగతా వ్యాయామాలు ఏవైనా చేస్తుంటే (ప్రధానంగా నెక్ వ్యాయామలు, ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ వంటి) వాటిని ఆపేయండి. మీరు బార్బర్ షాప్‌కు వెళ్లినప్పుడు అక్కడ మెడలు విరుచుకోకండి. పడుకుని టీవీ చూడకండి. 

మీరు పనిచేసే చోట సరైన రీతిలో కూర్చోండి. అలాగే మీ వాహనం మీకు తగినట్లుగా ఉందా అన్న విషయాన్ని చెక్ చేసుకోండి. అలాగే మీకు మెడనొప్పితో పాటు చేతులు, భుజాలు లాగినట్లుగా అనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను కలిసి పూర్తి పరీక్షలు చేయించుకోండి. 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top