నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు దర్శించవలసిన ఆలయంగా తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. ఈ ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మ సంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం, వివాహం ఆలస్యమయ్యే వారికి సత్వర వివాహ ప్రాప్తి మొదలైన ఎన్నో వరాలు లభిస్తాయని నమ్మకం. ఇక ఆలయంలో విశేష పూజల విషయానికి వస్తే..
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపిదేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్ రేపల్లె. స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.


