Madatha kaja;మడత కాజా అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే బయట షాప్స్ లో చేసిన విధంగా ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టకుండా తింటారు.
కావలసిన పదార్దాలు
మైదా - ఒక కిలో
పంచదార - ఒకటిన్నర కిలోలు
నూనె - తగినంత
యాలకుల పొడి - కొద్దిగా
డాల్డా - 100 గ్రాములు
తయారుచేసే విధానం
మైదాలో ముందుగా డాల్డా వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగా కలిపి పిండిని 5 నిముషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోని దానిలో పంచదార పోసి అది మునిగే వరకు నీళ్ళు పోసి మరిగించి లేత పాకం వచ్చాక యాలకుల పొడి కలపాలి.
పిండి ముద్దను పెద్ద ఉండలుగా చేసి పలుచని చపాతీలా వత్తాలి. చపాతీ వట్టేటప్పుడు పొడి పిండి చల్లుతూ చేస్తే అంటుకోకుండా ఉంటుంది. ఈ చపాతీని మళ్లీ సగానికి మడిచి వత్తేయాలి. దాని మీద మళ్లీ పొడి చల్లి చాపలా చుట్టాలి. ఈ చాప చుట్టలో ఎక్కువ పొరలు వస్తే కాజా అంత బాగుంటుంది. ఈ చుట్టను అర అంగుళం ముక్కలుగా కట్ చేయాలి.
ఈ ముక్కలను వేలుతో వత్తి,మళ్లీ పొడవుగా వచ్చేలా అప్పడాల కర్రతో వత్తాలి. వీటిని కాగిన నూనెలో వేసి తక్కువ మంటలో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. వీటిని తీసి పాకంలో వేసి 10 నిముషాలు ఉంచి తీసి పళ్ళెంలో ఆరబెట్టాలి. మరో 15 నిమిషాల తర్వాత పాకంలో మరోసారి ముంచి తీయాలి.


