వర్షాకాలంలో చెమటలు తక్కువగా పడతాయి, దీంతో వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ చర్మ రంధ్రాల్లో చేరి చికాకు కలిగించవచ్చు. అలాగే, చర్మం రంగు కూడా కొంత మారినట్లు అనిపిస్తుంది. అందుకే చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు సహజ స్కిన్ స్క్రబ్బింగ్ టెక్నిక్‌లను ఉపయోగించండి. ఇవి మీ ముఖాన్ని తెల్లగా, మెరిసేలా చేస్తాయి. ఈ సహజ ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1. శెనగపిండి, పసుపు, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, కొంచెం కొబ్బరి నూనె, చిటికెడు పసుపు కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత మెల్లగా మసాజ్ చేస్తూ నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ చర్మ రంధ్రాలను తెరిచి, టాక్సిన్స్, వ్యర్థాలను బయటకు తీస్తుంది.
కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా, దురదలు, చికాకు లేకుండా ఉంచుతుంది. పసుపు వర్షాకాలంలో వచ్చే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. శెనగపిండి చనిపోయిన కణాలను, రంధ్రాల్లోని మురికిని తొలగిస్తుంది.
2. అలోవెరా, పసుపు, తేనె ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో తాజా అలోవెరా గుజ్జు, చిటికెడు పసుపు కలిపి సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని రాసే ముందు వేడి నీటి ఆవిరి ముఖానికి పట్టండి. దీనివల్ల చర్మ రంధ్రాల్లోని మురికి చెమట రూపంలో బయటకు వస్తుంది.
ఆ తర్వాత అలోవెరా, పసుపు మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి 25-30 నిమిషాలు ఉంచి, సాధారణ నీటితో కడిగేయండి. రోజంతా కాలుష్యంలో తిరిగిన తర్వాత రాత్రి ఈ ప్యాక్ వాడితే, చనిపోయిన కణాలు, టాక్సిన్స్ తొలగి, చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆవిరి పట్టడం వల్ల శ్వాస సాఫీగా, నిద్ర గాఢంగా ఉంటుంది. ఈ సహజ పద్ధతిని ఒకసారి ప్రయత్నించండి.
3. పసుపు, పాలు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
రెండు టీస్పూన్ల పసుపు, రెండు టీస్పూన్ల పాలు, కొంత నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట ఉంచి, ఆ తర్వాత కడిగేస్తే చర్మ కణాలు హైడ్రేట్ అవి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ సహజ ఫేస్ ప్యాక్‌లతో వర్షాకాలంలో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.