TOMATO MASALA OATS:ఉదయం తేలికైన, నూనె లేని ఆహారం తినడానికి చాలా మంది ఇష్టపడతారు. రోజూ ఇడ్లీ, ఉప్మా వంటివి తినడం కూడా బోర్ కొడుతుంది. అందుకే, ఓట్స్‌తో రుచికరమైన "టమోటా మసాలా ఓట్స్" రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ తేలికగా, ఆరోగ్యకరంగా ఉండి, కొద్ది నిమిషాల్లో తయారవుతుంది. ఎలా చేయాలో చూద్దాం!
కావాల్సిన పదార్థాలు:
- ఓట్స్ - 1 కప్పు
- నూనె - కొద్దిగా
- మినపప్పు - ½ టీస్పూన్
- శనగపప్పు - ½ టీస్పూన్
- ఆవాలు - ½ టీస్పూన్
- జీలకర్ర - ½ టీస్పూన్
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
- పచ్చిమిర్చి - 1 లేదా 2
- క్యారెట్ తురుము - కొద్దిగా
- ఫ్రోజన్ బఠాణీలు - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - ¼ టీస్పూన్
- టమోటాలు - 2 (తరిగినవి)
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - తగినంత
- ధనియాల పొడి - ½ టీస్పూన్
- గరం మసాలా - ½ టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - 2 టీస్పూన్లు
తయారీ విధానం:
1. స్టవ్ వెలిగించి, కడాయిలో 1 కప్పు ఓట్స్ వేసి మీడియం మంటపై 3-4 నిమిషాలు కలుపుతూ వేయించండి. వేగిన ఓట్స్‌ను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి.
2. అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి కాగనివ్వండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించండి.
3. తాలింపు సిద్ధమైన తర్వాత, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగనివ్వండి.
4. ఆ తర్వాత క్యారెట్ తురుము, ఫ్రోజన్ బఠాణీలు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలు కలుపుతూ వేగించండి.
5. అనంతరం పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసి, మసాలా మాడకుండా కొద్దిగా నీళ్లు పోసి 1 నిమిషం కలుపుతూ వేయించండి.
6. ఇప్పుడు 4 కప్పుల నీళ్లు (ఓట్స్ కప్పుతో కొలిచి) పోసి, మిశ్రమాన్ని బాగా మరిగించండి. మరుగుతున్నప్పుడు వేయించిన ఓట్స్ వేసి కలపండి.
7. ఓట్స్ ఉడికిన తర్వాత, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి కలిపి స్టవ్ ఆపేయండి.
అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన "టమోటా మసాలా ఓట్స్" సిద్ధం! వేడివేడిగా ఆస్వాదించండి!