Panasa Kura:పనస తొనలే కాకుండా, పచ్చి పనస కాయతో చేసే కూర కూడా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. నాన్-వెజ్ కూరల రుచికి ఏ మాత్రం తగ్గకుండా ఘుమఘుమలాడే వంటకం ఇది.
అయితే, పనస కాయను కట్ చేయడం కొంచెం కష్టమైన పని. దీని జిగురు చేతులకు అంటుకుంటే తొలగడం కష్టం. అందుకే చేతులకు, కత్తికి కొద్దిగా నూనె రాసుకుంటే జిగురు అంటుకోకుండా సులభంగా కట్ చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
- పచ్చి పనస కాయ - చిన్నది
- ఉప్పు - రుచికి తగినంత
- పసుపు - అర టీస్పూన్
- అల్లం - 1 ఇంచు
- వెల్లుల్లి రెబ్బలు - 5
- కశ్మీరీ చిల్లీ - 7
- మిరియాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ధనియాలు - 2 టీస్పూన్లు
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- లవంగాలు - 2
- యాలకులు - 2
- నూనె - 5 టేబుల్ స్పూన్లు
- బిర్యానీ ఆకులు - 2
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఉల్లిపాయ - 1
- మసాలా పొడి - 1 టీస్పూన్
- టమోటాలు - 2
- కొత్తిమీర - తరిగినవి
తయారీ విధానం:
1. ముందుగా చేతులకు, కత్తికి నూనె రాసుకుని పనస కాయను ముక్కలుగా కట్ చేయాలి.
2. కడాయిలో నీళ్లు పోసి, ఉప్పు, పసుపు వేసి పనస ముక్కలను 90% ఉడికే వరకు ఉడికించాలి.
3. 10 నిమిషాల తర్వాత ఉడికిన ముక్కలను ప్లేటులోకి తీసుకోవాలి.
4. మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, కశ్మీరీ చిల్లీ, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
5. కడాయిలో నూనె వేసి, పనస ముక్కలను 5 నిమిషాలు అన్ని వైపులా కలుపుతూ వేయించి తీసుకోవాలి.
6. అదే కడాయిలో మిగిలిన నూనెలో బిర్యానీ ఆకులు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 5 నిమిషాలు వేయించాలి. నూనె తేలిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, 1 టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి.
7. 2 నిమిషాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలు, పనస కాయ ఉడికించిన నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి.
8. తర్వాత పనస ముక్కలను వేసి, మసాలా పట్టేలా కలిపి, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి.
9. చివరగా కొత్తిమీర తరుగు చల్లి గ్రేవీని దించుకోవాలి.