మీరు తరచూ ఏదో చెడు జరుగుతుందని భయపడుతుంటారా? తలుపులు లాక్ చేశారా లేదా అని పదేపదే తనిఖీ చేస్తుంటారా? ఇలాంటి లక్షణాలను సాధారణ అలవాట్లుగా పరిగణించకూడదు. ఎందుకంటే, ఇవి OCD యొక్క సంకేతాలు కావచ్చు.
సాధారణంగా ఎవరైనా చాలా శుభ్రంగా లేదా క్రమశిక్షణతో ఉంటే, “వీళ్లకు OCD ఉన్నట్లుంది” అని సరదాగా అంటుంటారు. అయితే, OCD అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
OCD అంటే ఏమిటి?
OCD (Obsessive Compulsive Disorder) అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య. దీనితో బాధపడేవారు కొన్ని ఆలోచనలను ఆపుకోలేరు. ఈ ఆలోచనలు తీవ్రమైన ఒత్తిడిని కలిగించి, కొన్ని పనులను పదే పదే చేయమని ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు, చేతులను పదేసార్లు కడగడం, తలుపు లాక్ అయిందా అని పదిసార్లు తనిఖీ చేయడం వంటివి.
ప్రపంచ ప్రఖ్యాత వైద్య సంస్థల ప్రకారం, OCD ఉన్నవారు సూక్ష్మక్రిములు, ధూళి గురించి నిరంతరం భయపడుతూటారు. వారు ఏ పని చేసినా అది పూర్తయినట్లు అనిపించదు, మెదడు ఆ పనిని మళ్లీ చేయమని ఒత్తిడి చేస్తుంది. ఇది మెదడులో సెరోటోనిన్ అనే రసాయనం అసమతుల్యత వల్ల జరుగుతుంది.
OCD లక్షణాలు
ఈ సమస్య స్త్రీ, పురుషులు ఇద్దరికీ రావచ్చు. OCD లక్షణాలు వ్యక్తులను బట్టి భిన్నంగా కనిపిస్తాయి:
- శుభ్రతపై అతిగా ఆందోళన, ధూళి లేదా పురుగులతో మురికి అవుతుందని భయం.
- అనవసర భయాలు, తాను తప్పు చేస్తానేమో లేదా ఇతరులకు హాని తలపెడతానేమో అనే ఆందోళన.
- నియంత్రణ లేని ఆలోచనలు, ముఖ్యంగా ప్రమాదం లేదా మరణం గురించి.
- ప్రమాద భయం, రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా జరుగుతుందేమో అని భయపడటం.
- బయటకు వెళ్లడానికి భయం, ఇంటి నుంచి బయటకు రావడానికి ఆందోళన పడటం.
OCD ఉన్నవారు ఏం చేయాలి?
సకాలంలో గుర్తిస్తే OCDని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. కొన్ని వ్యక్తిగత మార్పులు సహాయపడతాయి:
- ఆలోచనలు రాయడం: ఆందోళన కలిగించే ఆలోచనలను డైరీలో రాయడం వల్ల స్పష్టత వస్తుంది, ఆ ఆలోచనలు మనపై ప్రభావం తగ్గుతాయి.
- వాస్తవాలను అర్థం చేసుకోవడం: తప్పుడు భయాలను వాస్తవాలతో సరిచేసుకోవాలి.
- సానుకూల ఆలోచనలు: “నేను బాగోలేను” అనే బదులు, “ఇది తాత్కాలిక సమస్య” అని ఆలోచించడం.
- ఆత్మీయుల సహాయం: సన్నిహితులతో మాట్లాడటం, వారి మద్దతు పొందడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
చికిత్స ఎలా ఉంటుంది?
OCD చికిత్సలో ప్రధానంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), మానసిక కౌన్సెలింగ్ ఉపయోగిస్తారు. అవసరమైతే వైద్యుల సలహాతో తగిన మందులు ఇస్తారు. మందులను కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.
ముఖ్య గమనిక: OCD అనేది సాధారణ అలవాటు కాదు. ఇది గుర్తించి, చికిత్స పొందాల్సిన మానసిక ఆరోగ్య సమస్య. శరీరానికి జ్వరం వచ్చినట్లే, మనసుకు కూడా చికిత్స అవసరం. మీకు లేదా మీకు తెలిసిన వారికి ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.