వైద్య నిపుణులు వ్యాయామం మన ఆరోగ్యానికి కీలకమని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యం, శరీర దృఢత్వం కోసం ప్రతి వ్యక్తి వేర్వేరు పద్ధతులను అనుసరిస్తారు. వాకింగ్, జాగింగ్, జిమ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలతో పాటు సరైన ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
అయితే, మీకు తెలుసా? రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.
స్కిప్పింగ్ ద్వారా 15 నిమిషాల్లో సుమారు 150-200 కేలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగి బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి స్కిప్పింగ్ అద్భుత ఫలితాలను ఇస్తుంది. స్కిప్పింగ్‌లో జంప్ చేస్తూ ఉంటాం. 10 నిమిషాల స్కిప్పింగ్, ఒక మైలు పరుగెత్తినంత ప్రయోజనకరమని నిపుణులు చెబుతారు.
ప్రతిరోజూ 15 నిమిషాల స్కిప్పింగ్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు హృదయ సమస్యలను నివారిస్తుంది. స్కిప్పింగ్ మెదడుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. జంప్ చేసేటప్పుడు మెదడు సంకేతాలు పంపడం వల్ల దాని పనితీరు మెరుగవుతుంది.
రోజూ 15 నిమిషాల స్కిప్పింగ్ ఎముకలను బలోపేతం చేసి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. కాళ్లు, చేతులు, పొత్తికడుపు కండరాలు బలపడతాయి, శరీరం ఫిట్‌గా కనిపిస్తుంది.
స్కిప్పింగ్ శరీర సమతుల్యతను పెంచుతుంది, నడిచేటప్పుడు స్థిరత్వం అందిస్తుంది మరియు తడబడే సమస్యలను తగ్గిస్తుంది. 15 నిమిషాల స్కిప్పింగ్ స్టామినాను రెట్టింపు చేసి, శారీరక పనుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
స్కిప్పింగ్ ఎండార్ఫిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది, ఒత్తిడి మరియు ఆందోళనలను తగ్గిస్తుంది, మంచి మానసిక స్థితిని కలిగిస్తుంది. రోప్‌ను ఎగరేస్తూ జంప్ చేయడం ఏకాగ్రతను పెంచి, మెదడును చురుగ్గా ఉంచుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.