
సుమారు ఐదేళ్లపాటు నిర్మాణంలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. దర్శకుడు క్రిష్ మధ్యలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను చేపట్టి సినిమాను పూర్తి చేశారు. రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడింది.
అనేక సవాళ్లను అధిగమించి, జూలై 24న భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చర్చ జరుగుతోంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేటర్ ఫలితాల ప్రభావంతో, నాలుగు వారాల గ్యాప్‌తోనే సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని అమెజాన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22 నుంచి ‘హరిహర వీరమల్లు’ స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కొల్లూరు నుంచి దొరికిన కోహినూర్ వజ్రం మొఘల్ రాజుల చేతుల్లోకి ఎలా వెళ్లింది? ఆ వజ్రాన్ని ఔరంగజేబు నుంచి స్వాధీనం చేసుకోవడానికి వీరమల్లు ఏం చేశాడన్నది యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో క్రిష్, జ్యోతికృష్ణలు తెరపై ఆవిష్కరించారు.
పవన్ కళ్యాణ్ నటన, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ, వీఎఫ్‌ఎక్స్, సీజీ వర్క్ అంచనాలకు తగ్గట్టు లేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారింది. రెండో భాగం కోసం కథను అసంపూర్తిగా ముగించడంపై విమర్శలు వచ్చాయి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ఆమె పంచమి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు. సీనియర్ నిర్మాత ఏఎమ్ రత్నం దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.