Lakshmi Charu:ఆంధ్రా స్పెషల్ పాతకాలపు "లచ్చించారు" - ఘుమఘుమలాడే రుచికి ఫిదా అవుతారు.. అమ్మమ్మల కాలం నాటి పాతకాలపు వంటలు ఎంతో రుచికరంగా ఉంటాయి. రోటి పచ్చళ్లైనా, చింతపులుసైనా, చిట్టి గారెలైనా సరే! ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
పాత తరం వంటకాలను రుచి చూసిన వారిలో, ముఖ్యంగా 90's కిడ్స్‌కు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. అల్లం మురబ్బా, చింతకాయ రోటి పచ్చడి, ముద్ద పప్పు-చింతపులుసు కాంబినేషన్... ఇవన్నీ అస్సలు మరచిపోలేము.
ప్రాంతాలవారీగా పాతకాలం నాటి రెసిపీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో "లచ్చించారు" కూడా ఒకటి. గంజితో సాంబార్ లాంటి రుచిని డిఫరెంట్‌గా ఆస్వాదించవచ్చు. ఇక్కడ చెప్పిన విధంగా మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి!
కావలసిన పదార్థాలు:
- కలిగంజి - 3 గ్లాసులు
- ఉప్పు - రుచికి తగినంత
- పసుపు - అర టీస్పూన్
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
- పచ్చిమిర్చి - 3 (చీలికలు)
- వంకాయలు - 2 (ముక్కలు)
- టమాటా - 2 (ముక్కలు)
- బెండకాయలు - 5 (ముక్కలు)
- కరివేపాకు - 1 రెమ్మ
- కారం - 2 టీస్పూన్లు
తయారీ విధానం:
ముందుగా, నాలుగైదు రోజులుగా తీసిపెట్టుకున్న 3 గ్లాసుల కలిగంజిని ఒక గిన్నెలోకి తీసుకుని పొయ్యి మీద మరిగించండి. గంజి మరుగుతున్నప్పుడు ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి.
గంజి మరుగుతుండగానే, మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించండి. ఉల్లిపాయలు రంగు మారగానే పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేయండి.
ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వండి.
5 నిమిషాలు మగ్గిన తర్వాత, కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోండి.
ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసి, మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. తర్వాత పసుపు, కారం వేసి గరిటెతో బాగా కలపండి.
కూరగాయలు బాగా ఉడికిన తర్వాత, వాటిని మరుగుతున్న గంజిలో వేసి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించండి. మొత్తం 10 నిమిషాలు మరిగిస్తే చాలు – ఘుమఘుమలాడే వాసన వస్తుంది.
ఎంతో రుచికరమైన ఈ "లచ్చించారు" 90's కిడ్స్ చిన్నప్పటి ఫేవరెట్ ఐటమ్! మీరూ ఈ పాతకాలపు వంటను ఒకసారి ప్రిపేర్ చేసి ఆస్వాదించండి.


