Raw Banana Bajji:అరటికాయ బజ్జి ఈ టిప్స్ తో వేస్తే అచ్ఛం బండిమీద బజ్జి టేస్ట్ వస్తుంది.. సాయంత్రం స్నాక్స్ కోసం ఇంట్లో వివిధ రకాల టేస్టీ ఆహారాలు తయారు చేస్తుంటారు. గారెలు, వడలు, పునుగులు వంటివి సాధారణం. అందులో బజ్జీలు కూడా ఒకటి.
సాధారణంగా మిర్చీతో చేస్తారు కానీ, ఒకసారి అరటికాయలతో ట్రై చేసి చూడండి. చాలా రుచిగా వస్తాయి. అంతేకాకుండా, నూనె కూడా తక్కువగా పీల్చుకుంటాయి! ఇంట్లో ఇలా సర్వ్ చేస్తే పిల్లలు, పెద్దలు మరోటి అడుగుతారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- అరటికాయలు - 5
- బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
- శనగపిండి - 2 కప్పులు
- పసుపు - అర టీ స్పూన్
- వాము పొడి - 2 టీ స్పూన్లు
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- కస్తూరి మెంతి - 1 టేబుల్ స్పూన్
- వంటసోడా - కొంచెం
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
- ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం:
ముందుగా అరటికాయల చివరలు కట్ చేసి, పీలర్‌తో చెక్కు తీసేయండి. ఒక గిన్నెలో ఉప్పు నీళ్లు తీసుకొని, అరటికాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి.అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా (క్రాస్‌గా) కట్ చేసి, రంగు మారకుండా ఉప్పు నీటి గిన్నెలో వేసి ఉంచండి.
మిక్సింగ్ బౌల్‌లో శనగపిండి (2 కప్పులు), బియ్యప్పిండి (2 టేబుల్ స్పూన్లు), ఉప్పు, వాము పొడి (2 టీస్పూన్లు), ధనియాల పొడి (1 టీస్పూన్), జీలకర్ర పొడి (అర టీస్పూన్) వేసి కలపండి.క్రష్ చేసిన కస్తూరి మెంతి (1 టేబుల్ స్పూన్), వంటసోడా (కొంచెం) యాడ్ చేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో మిక్స్ చేయండి.
ఉప్పు నీటిలోని అరటికాయ ముక్కలను తడి లేకుండా పొడి గుడ్డతో తుడిచి, పిండి మిశ్రమంలో బాగా కలిపి పూత పూసుకోండి.కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత, పిండి పూసిన అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసి, మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించండి.
టిష్యూ పేపర్ పరచిన ప్లేట్‌లోకి తీసి, వేడివేడిగా సర్వ్ చేయండి.ఇలా ఒకసారి ట్రై చేస్తే, అందరూ వావ్ అంటారు!


