Boondi laddu:"సంక్రాంతి స్పెషల్: నోట్లో కరిగిపోయే బూందీ లడ్డు.. కొత్తగా నేర్చుకునే వారికి పక్కా కొలతలు!"..సంక్రాంతి పండుగ అంటేనే పిండివంటలు. అందులోనూ బూందీ లడ్డు లేకపోతే పండుగ కళే రాదు. చాలామంది పాకం కుదరదేమో అని భయపడతారు. కానీ, సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే స్వీట్ షాప్ స్టైల్‌లో, నోట్లో కరిగిపోయేలా లడ్డు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
శనగపిండి: 2 కప్పులు (జల్లించుకోవాలి)
పంచదార: 2 కప్పులు (తీపి ఎక్కువ కావాలంటే మరో అర కప్పు వేసుకోవచ్చు)
నీళ్లు: 1 కప్పు (పాకం కోసం)
జీడిపప్పు, కిస్మిస్: గుప్పెడు
యాలకుల పొడి: 1 టీస్పూన్
పచ్చ కర్పూరం: చిటికెడు (గుడిలో ప్రసాదం రుచి రావాలంటే ఇది ముఖ్యం)
లవంగాలు: 4-5 (నేతిలో వేయించినవి)
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
వంట సోడా: చిటికెడు (బూందీ గుల్లగా రావడానికి)
తయారీ విధానం:
ఒక గిన్నెలో జల్లించిన శెనగపిండి, చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి.కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా దోశ పిండి కంటే కొంచెం జారుగా ఉండాలి. (గరిటెతో పిండిని ఎత్తితే దారలా పడాలి).
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగాలి.బూందీ గరిటె తీసుకుని, నూనెపై పెట్టి, అందులో పిండి వేయాలి. గరిటెను కదపకుండా ఉంటే బూందీ ముత్యాల్లా పడుతుంది.
లడ్డు కోసం బూందీ కరకరలాడకూడదు. నూనెలో వేసిన తర్వాత నురగ తగ్గుతున్నప్పుడు, బూందీ మెత్తగా ఉండగానే తీసేయాలి. (వేలితో నొక్కితే మెత్తగా ఉండాలి). ఇలా మొత్తం పిండిని బూందీలా చేసుకుని పక్కన పెట్టుకోండి.
వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి.పంచదార కరిగి, పాకం ఉడుకుతున్నప్పుడు వేలితో ముట్టుకుని చూడండి. వేళ్ళ మధ్య తీగ పాకం (Single String Consistency) రావాలి. మరీ ముదురు పాకం రాకూడదు, లడ్డు గట్టిగా అయిపోతుంది. పాకం రాగానే స్టవ్ ఆపేసి.. అందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి కలపాలి.
వేడిగా ఉన్న పాకంలోనే ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని వేసి బాగా కలపాలి.అందులోనే నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, 2 స్పూన్ల నెయ్యి వేసి కలపాలి.బూందీ పాకాన్ని పీల్చుకోవడానికి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టండి.
మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకుని గట్టిగా ఒత్తుతూ లడ్డూలు చుట్టుకోవాలి.
పర్ఫెక్ట్ లడ్డు కోసం సీక్రెట్ టిప్స్:
పిండి జారుగా అయితే: బూందీ తోకల్లా వస్తుంది. అలాంటప్పుడు కొంచెం శెనగపిండి కలపండి.
పిండి గట్టిగా అయితే: బూందీ గట్టిగా, రౌండ్ రాకుండా ఉంటుంది. అప్పుడు కొంచెం నీళ్లు కలపండి.
పాకం ముదురుతే: ఒకవేళ పాకం ముదిరిపోతే భయపడకండి, అందులో 2 స్పూన్ల వేడి నీళ్లు పోసి కలిపితే సరిపోతుంది.
కలర్ కోసం: మీకు స్వీట్ షాప్ కలర్ కావాలంటే పిండిలో చిటికెడు పసుపు లేదా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు.
బూందీ ఆరిపోతే: పాకంలో వేయకముందే బూందీ బాగా ఆరిపోయి ఉంటే, దాన్ని మిక్సీలో ఒక్క రౌండ్ (Pulse) తిప్పి పాకంలో వేస్తే లడ్డు బాగా వస్తుంది.


