Generic Medicines:రూ.100 మందు కేవలం రూ.10 కే.. 'జనరిక్ మందులు' అంత తక్కువ ధరకు ఎలా వస్తాయో తెలుసా?
హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ రాసిచ్చిన మందుల చిట్టీ పట్టుకుని మెడికల్ షాపుకు వెళ్లగానే, ఆ బిల్లు చూసి ఒక్కోసారి షాక్ అవుతుంటాం. అయితే, బారీ ధరలు ఉండే బ్రాండెడ్ మందులకే ఏమాత్రం తీసిపోని 'జనరిక్ మందులు' చాలా తక్కువ ధరకే దొరుకుతాయని మీకు తెలుసా?
చాలామందికి "ధర తక్కువ కదా, ఇవి సరిగ్గా పనిచేస్తాయా?" అనే అనుమానం ఉంటుంది. కానీ వాస్తవానికి జనరిక్ మందులు అంత చౌకగా ఎందుకు దొరుకుతాయో ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.
జనరిక్ మందుల ధరలు తక్కువగా ఉండటానికి అసలు కారణాలివే:
రీసెర్చ్ (R&D) ఖర్చులు ఉండవు: ఒక కొత్త మందును కనిపెట్టడానికి ఫార్మా కంపెనీలు కోట్లు ఖర్చు చేస్తాయి. అందుకే పేటెంట్ ఉన్నన్ని రోజులు ఆ మందును ఎక్కువ ధరకు అమ్ముతాయి. పేటెంట్ గడువు ముగిశాక, అదే ఫార్ములాతో ఇతర కంపెనీలు జనరిక్ మందులు తయారు చేస్తాయి. వీరికి రీసెర్చ్ ఖర్చులు ఉండవు కాబట్టి మందులు తక్కువకే ఇస్తాయి.
క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు: బ్రాండెడ్ మందుల తయారీలో జంతువులు, మనుషులపై ప్రయోగాలు చేస్తారు. జనరిక్ మందులకు అప్పటికే ప్రూవ్ అయిన ఫార్ములా వాడతారు కాబట్టి ఈ ఖర్చు కూడా మిగులుతుంది.
ప్రకటనల ఆర్భాటం శూన్యం: బ్రాండెడ్ కంపెనీలు తమ మందుల ప్రచారం కోసం, డాక్టర్లను కలిసే మెడికల్ రిప్రజెంటేటివ్స్ (MR) కోసం భారీగా ఖర్చు చేస్తాయి. జనరిక్ మందులకు ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులు ఉండవు.
భారీ పోటీ: ఒకే మందు ఫార్ములాను చాలా కంపెనీలు పోటీ పడి తయారు చేయడం వల్ల కూడా మార్కెట్లో ధరలు అమాంతం తగ్గుతాయి.
అపోహ వద్దు.. నాణ్యతలో రాజీ లేదు!
జనరిక్ మందులు తక్కువ ధరకు వస్తాయి కదా అని వాటి నాణ్యత తక్కువగా ఉంటుందనుకోవడం పూర్తిగా అపోహ మాత్రమే. బ్రాండెడ్ మందులో ఉండే ప్రధాన ఔషధ గుణం (Active Ingredient), దాని డోసేజ్, పనితీరు జనరిక్ మందుల్లోనూ 100% సమానంగానే ఉంటాయి. ప్రభుత్వ కఠిన పరీక్షల తర్వాతే ఇవి మార్కెట్‌లోకి వస్తాయి.
ఎక్కడ దొరుకుతాయి?
సామాన్యులకు వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 'జనౌషధి కేంద్రాల' (Jan Aushadhi) ద్వారా ఈ నాణ్యమైన మందులను అతి తక్కువ ధరకు అందిస్తోంది. ఇకపై మీరు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు "జనరిక్ మందులు రాయండి" అని అడగడం ద్వారా మీ మెడికల్ బిల్లును సగానికి పైగా తగ్గించుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


