సాధారణంగా ప్రతి ఇంట్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే మొదటగా గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ. వీటి కోసం వారాంతాల్లోనే పిండి రుబ్బి ఫ్రిజ్‌లో పెట్టుకోవడం చాలామందికి అలవాటు.
అయితే, చలికాలం లేదా వానాకాలంలో పిండి వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉన్నా, ఎండాకాలంలో మాత్రం చాలా త్వరగా పులిసిపోతుంది.
వాతావరణంలో ఉండే వేడి వల్ల పిండిలో పులియబెట్టే ప్రక్రియ (ఫెర్మెంటేషన్) వేగవంతం అవుతుంది. దీనివల్ల రెండు రోజులకే పిండి పుల్లగా మారిపోయి, రుచి మారిపోతుంది.
అయితే, ఎండాకాలంలో కూడా ఇడ్లీ, దోశ పిండి రోజుల తరబడి కమ్మగా, ఫ్రెష్‌గా ఉండాలంటే పిండి రుబ్బేటప్పుడు ఒక చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుంది.
అవును, మీరు విన్నది నిజమే. ఇడ్లీ లేదా దోశ పిండిని మిక్సీలో లేదా గ్రైండర్‌లో రుబ్బేటప్పుడు సాధారణ నీటికి బదులుగా ఐస్ క్యూబ్స్ (Ice cubes) లేదా బాగా చల్లగా ఉండే ఐస్ వాటర్ (Ice water) పోసి రుబ్బాలి.
ఇది ఎలా పనిచేస్తుందంటే: మిక్సీ లేదా గ్రైండర్ వేసినప్పుడు మోటార్ వల్ల వేడి పుడుతుంది. బయట ఉండే ఎండల వేడికి తోడు, ఈ మిక్సీ వేడి కూడా తోడవడంతో పిండి రుబ్బుతున్నప్పుడే వేడెక్కుతుంది.
ఇలా వేడిగా ఉన్న పిండి బయట పెట్టగానే గంటల్లోనే పులిసిపోయి, పుల్లటి వాసన వస్తుంది. రుబ్బేటప్పుడు ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల.. మిక్సీ వేడిని ఇది బ్యాలెన్స్ చేస్తుంది.
పిండి చల్లగా ఉండటం వల్ల ఫెర్మెంటేషన్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీంతో పిండి మరీ ఎక్కువగా పులిసిపోకుండా, కావలసినంత మేరకే పులిసి చక్కగా ఉంటుంది.
వేసవిలో పిండి తాజాగా ఉండేందుకు మరికొన్ని చిట్కాలు:
ఉప్పు కలపకండి: చాలామంది పిండి రుబ్బగానే ఉప్పు కలిపేస్తుంటారు. ఎండాకాలంలో ఇలా చేయకూడదు. పిండిని రుబ్బిన తర్వాత అలాగే ఫ్రిజ్‌లో పెట్టుకుని, ఎప్పుడు దోశ లేదా ఇడ్లీ వేసుకుంటామో అప్పుడు మాత్రమే బయటకు తీసి, కావాల్సినంత పిండిలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కలపడం వల్ల పిండి త్వరగా పులిసిపోతుంది.
తమలపాకు ట్రిక్: పిండి రుబ్బి గిన్నెలో తీసిన తర్వాత, దానిపైన ఒక తమలపాకు (Betel leaf) బోర్లించి మూత పెట్టాలి. తమలపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పిండిని త్వరగా పాడవకుండా, పుల్లటి వాసన రాకుండా అడ్డుకుంటాయి.
గాలి చొరబడని డబ్బా: పిండిని ఎప్పుడైనా గాలి చొరబడని (Airtight) కంటైనర్‌లో ఉంచి మాత్రమే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.
ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు, ఈ ఎండాకాలంలో కూడా మీ ఇడ్లీ, దోశ పిండి వారం రోజుల పాటు ఏమాత్రం పుల్లగా మారకుండా, మొదటి రోజు రుబ్బినప్పుడు ఎలా ఉందో అంతే ఫ్రెష్‌గా ఉంటుంది! ఇంకెందుకు ఆలస్యం, ఈసారి పిండి రుబ్బేటప్పుడు కచ్చితంగా ఈ ఐస్ వాటర్ ట్రిక్ ట్రై చేసి చూడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

